శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 మార్చి 2021 (13:10 IST)

నెల్లూరు సీఐ ప్రాణాలు తీసిన బల్లి.. ఎలా?

నెల్లూరు జిల్లాకు చెందిన ఓ సీఐ గుంటూరు జిల్లాలో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ క్రమంలో ఆ సీఐ మృతికి ఓ బల్లి కారణమని వీడియో ఫుటేజీల ద్వారా తేలింది. తనకు తెలిసిన మహిళ ఇంటికి వెళ్లగా, అక్కడ నిర్మాణంలో ఉన్న లిఫ్టు దగ్గర బల్లి కనిపించింది. దాన్ని చీపురుతో తరిమే క్రమంలో ఆయన భవనం పైనుంచి కిందపడ్డారు. ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సీఐ శేషారావు నెల్లూరు ఎస్పీ దగ్గర వీఆర్‌లో ఉన్నారు. ఈయనపై గతంలో కొన్ని ఫిర్యాదులు రావడంతో ప్రస్తుతం జిల్లా ఎస్పీ కార్యాలయంలో వీఆర్‌లో ఉన్నారు. కొంతకాలంగా ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
 
ఈ క్రమంలో తన కుమార్తెకు మెడికల్‌ సీటు విషయమై మాట్లాడటానికి గుంటూరు పండరీపురంలో ఉన్న ఓ మహిళ ఇంటికి ఈ నెల 7వ తేదీ ఆదివారం రాత్రి వెళ్లారు. రాత్రి 9 గంటల సమయంలో ఆ ఇంట్లో నిర్మాణంలో ఉన్న లిఫ్ట్‌ దగ్గర బల్లి ఉండగా.. దాన్ని చీపురుతో తోలేందుకు ప్రయత్నించారు. బల్లిని తరిమే క్రమంలో ఆయన గమనించకుండా పక్కకు ఒరిగి రెండో అంతస్తు నుంచి జారిపడ్డారు. ఈ సీన్ మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
 
సీఐ భవనంపై నుంచి కిందకు పడిపోగానే గుర్తించి మహిళ కుమారుడు ఆయన కుటుంబీకులకు సమాచారమిచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీఐ శేషారావు సోమవారం ఉదయం చనిపోయారు. మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. భార్య మధురవాణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
 
ఈ విచారణలో భాగంగా, సీసీ పుటేజీలను పరిశీలించగా, అసలు విషయం వెల్లడైంది. తనకు తెలిసిన మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న లిఫ్టు దగ్గర బల్లి కనిపించింది. దాన్ని చీపురుతో తరిమే క్రమంలో ఆయన భవనం పైనుంచి కిందపడ్డారు. ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. సీసీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయ్యంది. తొలుత సీఐది ముందు అనుమానాస్పద మరణంగా భావించారు. సీసీ ఫుటేజీ తర్వాత కొంత స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.