మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 11 మార్చి 2021 (17:27 IST)

బెజవాడ దుర్గమ్మకు మంగళగిరి చేనేత పట్టువస్త్రాలు సమర్పించిన శివభక్త మార్కండేయ వంశీకులు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బెజవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి శ్రీ శివభక్త మార్కండేయ వంశీకులు గురువారం మంగళగిరి చేనేత వస్త్రాలను బహుకరించారు. మంగళగిరిలో చేనేత మగ్గాలపై వారం రోజులపాటు ఈ వస్త్రాలను ప్రత్యేకంగా తయారు చేయించారు.
 
శివరాత్రి సందర్భంగా జరిగే దుర్గామల్లేశ్వరస్వామివార్ల కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని శివభక్త మార్కండేయ వారసులుగా అమ్మవారికి చేనేత పట్టుచీరె, స్వామివారికి శేషవస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది ఉత్సవానికి ఆప్కో చైర్మన్ చిల్లపల్లి నాగ వెంకట మోహనరావు, పద్మావతి దంపతులు ప్రధాన కైంకర్యపరులుగా వ్యవహరించారు. మంగళగిరి మార్కండేయ పద్మశాలీయ యువజన సంఘం కన్వీనరు దామర్ల వెంకట నరసింహం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
 
తొలుత సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చిల్లపల్లి నాగవెంకట మోహనరావు, గంజి చిరంజీవి ప్రభృతులు సతీసమేతంగా  పట్టువస్త్రాలు, గాజులు, పసుపు, కుంకుమ, విభూది, ఫలపుష్పాలను 14 వెదురు పళ్లెములలో కూర్చి ఆలయానికి చేరుకున్నారు. వీరికి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి దుర్గగుడి కార్యనిర్వహణాధికారి ఎంవీ సురేష్‌బాబుకు పట్టు వస్త్రాలను అందజేశారు.
 
అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో సురేష్‌బాబు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్త మార్కండేయ వంశీకులు అందె నాగప్రసాద్‌, దామర్ల రాజు, దామర్ల కుబేరస్వామి, దామర్ల శ్రీనివాసరావు, అవ్వారు శ్రీనివాసరావు, చిల్లపల్లి శ్రీనివాసరావు, గుత్తికొండ ధనుంజయరావు, కొల్లి ఉదయ్, బిట్రా శ్రీనివాసరావు, మాచర్ల నిర్మల, కాండ్రు రవి, దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.