బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (10:51 IST)

రీపోలింగ్ లేకుండా మునిసిప‌ల్ ఎన్నికలు - ఇదే తొలిసారి అన్న నిమ్మ‌గ‌డ్డ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తెలిపారు. ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన అనంతరం నిమ్మగడ్డ మీడియాతో మాట్లాడారు. రీపోలింగ్ లేకుండా మునిసిపల్ ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి అని తెలిపారు. ఎటువంటి ఘటనలు జరకుండా పోలింగ్ నిర్వహించడానికి తోడ్పడిన అందరికీ అభినందనలు తెలిపారు. 
 
జిల్లాల‌ వారీగా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులను కోరామన్నారు. వార్డు వాలంటీర్లు ఎన్నికలలో పాల్గొనని సందర్భాలను నోట్ చేసి, హైకోర్టు తీర్పు ఆధారంగా చర్యలుంటాయని తెలిపారు. కార్పొరేషన్లు 57.41 శాతం, మునిసిపాలిటీలు 70.65 శాతం పోలింగ్ జరగడం సంతృప్తికరమని ప్రకటించారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పేర్కొన్నారు. 
 
ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థల్లోని 581 డివిజన్లు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లోని 1,633 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,213 డివిజన్లు/వార్డుల్లో కలిపి 77,73,231 మంది ఓటర్లున్నారు. 2,123 వార్డులకు 490 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
 
మొత్తం 7,915 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరిలో పురుష ఓటర్లు 38,25,129 మంది కాగా.. మహిళా ఓటర్ల సంఖ్య 39,46,952. ట్రాన్స్‌జెండర్లు 1150 మంది ఉన్నారు. మొత్తం 7,549 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2,320 అత్యంత సమస్యాత్మక, 2,468 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఇప్పటికే పులివెందుల, పుంగనూరు, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఏకగ్రీవమయ్యాయి.