బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (10:02 IST)

వలపు వల విసిరిన యువతి... నగ్నగా చిక్కిన సాఫ్ట్‌వేర్ టెక్కీ...

ఓ యువతి విసిరిన వలపు వలకు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చిక్కాడు.  ‘కాల్‌ మీ ఎనీటైమ్. ఐయామ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ టు టాక్’ అంటూ వచ్చిన ఓ సందేశం ఆ టెక్కీ కొంప ముంచింది. ఆ సందేశం వచ్చిన ఫోన్ నంబరుకు వీడియో కాల్ చేయగా అవతల ఫోన్ తీసింది ఓ అందమైన యువతి. తీయటి మాటలు చెప్పడంతో టెక్కీ పడిపోయారు. ఆ యువతి వలపు వల నుంచి బయటపడేందుకు ఏకంగా రూ.24 లక్షలు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్టణం జిల్లా వేపగుంటకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు గతేడాది నవంబరు 6న కవ్వించే ఓ మెసేజ్ వచ్చింది. ‘కాల్‌ మీ ఎనీటైమ్. ఐయామ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ టు టాక్’ అని ఉన్న ఆ మెసేజ్‌లో 55678557 నంబరుకు కాల్ చేయాలని ఉంది. 
 
అది చూసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉత్సాహం ఆపుకోలేక ఆ నంబరుకు కాల్ చేశాడు. అటునుంచి ఓ అమ్మాయి మత్తెక్కించేలా మాట్లాడుతూ న్యూడ్‌గా వీడియో కాల్ చేయమని కోరింది. క్షణం కూడా ఆలోచించకుండా ఆమె అడిగిందే తడవుగా వీడియో కాల్ చేశాడు. ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే న్యూడ్ వీడియో కాల్ చేసి ఇద్దరూ మాట్లాడుకున్నారు.
 
ఆ తర్వాతే టెక్కీకి కష్టాలు మొదలయ్యాయి. న్యూడ్ వీడియో కాల్ స్క్రీన్‌షాట్లు పంపిన ఆ యువతి డబ్బుల కోసం డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకుంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించింది. ఈ క్రమంలో మరో ఇద్దరు వ్యక్తులు రంగంలోకి దిగి అతడిని బెదిరించారు. 
 
ఆ వీడియోలు సోషల్ మీడియాకు ఎక్కితే తన పరువు పోతుందని భయపడిన బాధితుడు పలు దఫాలుగా వారు అడినంత చెల్లించుకున్నాడు. మొత్తంగా రూ.24 లక్షలు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ వారి నుంచి వేధింపులు ఆగకపోవడంతో జులై 16న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసి తన గోడు వెళ్లబోసుకున్నాడు.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల బ్యాంకు ఖాతాల ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించారు. కృష్ణా జిల్లా దబ్బకుపల్లికి చెందిన షేక్ అబ్దుల్ రహీం (30) హైదరాబాద్ కేంద్రంగా జీడిమెట్లకు చెందిన దంపతులు గుండా జ్యోతి (28), గుండీ వీర సతీష్ (34) ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. 
 
వెంటనే హైదరాబాద్ చేరుకుని వారిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.5 లక్షల నగదు, ల్యాప్‌టాప్, 8 మొబైల్ ఫోన్లు, 3 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది.