సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

ప్రజా సమస్యలను పరిష్కరించండి.. మంత్రి వనిత

ప్రజా సమస్యలను మీరు పరిష్కరించండి.. నిధుల కొరత లేకుండా మేము చూస్తామని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.

సచివాలయంలో బుధవారం రాష్ట్రంలోని 13 జిల్లాల డైరెక్టర్లు, ఎన్జీవో ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా విభిన్న ప్రతిభావంతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై మంత్రి సమీక్షించారు. కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ దమయంతి, అన్ని జిల్లాల డైరెక్టర్లు పనితీరును మంత్రికి వివ‌రించారు.

జిల్లాలో స్పందన కార్యక్రమం ద్వారా విభిన్న వర్గాల నుంచి వస్తున్న సమస్యల పరిష్కార మార్గాలను ఆయా జిల్లాల డైరెక్టర్లు మంత్రికి వివరించారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో జరిగిన సమీక్షలో స్పందన కార్య్రమం ద్వారా సమస్యల పరిష్కారం పూర్తి స్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

2019-20   బడ్జెట్‌లో కేటాయింపులు దివ్యాంగుల కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులు సక్రమంగా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు కావాలన్నా తాను విడుదల చేయిస్తానని మీకున్న అవకాశాలలో విభిన్న ప్రతిభావంతులకు మానవతా ధృక్పథంతో సహకారం అందించాలని మంత్రి ఆదేశించారు.

మన ప్రభుత్వం నుంచి ప్రజలు ఎంతో ఆశిస్తున్నారని.. వారి ఆశలకు తగిన విధంగా పనిచేయాలని కోరారు. అన్ని జిల్లాల్లో విభిన్నతరగతుల ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారిని చైతన్యపరచాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వం వారికి ఏవిధంగా సహాయం చేస్తుందో..వివరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. అనేక ప్రమాదాలకు గురై ఇంటి వారి సహకారం లేక బయట తిరగలేక ఇతరులపై ఆధారపడి ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న రుణాల ద్వారా సహకారం అందించాలని కోరారు. 

ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందజేయడం ద్వారా వారు సంతోషంగా జీవించడానికి వీలు కలుగుతుందన్నారు. సేవాభావంతో పనిచేయడం వల్ల కుటుంబానికి చేసినంత ఆనందం ఉద్యోగుల్లో కలగాలని సూచించారు. ప్రభుత్వం విడుదల చేసే నిధుల కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ జీవోలు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాలను సందర్శించాలని మంత్రి పిలుపునిచ్చారు.

అక్కడ వృద్ధులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఎన్ జీవో సంస్థలకు సరైన మార్గనిర్ధేశకాలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ప్రజల్లో చాలా మార్పులు వచ్చాయని అందుకు ఉదాహరణగా వృద్ధులు పింఛన్ పొందిన మొదటి 4 రోజులు బాగా చూసుకుంటున్న పిల్లలు.. ఆ తర్వాత వారి బాగోగులను అశ్రద్ద చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అటువంటి వారిపై ప్రత్యేక దృష్టిపెట్టి.. వృద్ధుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంత్రి వివరించారు. ఉద్యోగ ధర్మంలా కాకుండా మానవతా ధృక్పథంతో ఈ కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు సూచించారు. దివంగత నేత వైఎస్ హాయాంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు.

గత ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లినప్పుడు వైఎస్ జగన్ సీఎం కావాలని ఎంతో మంది పేద ప్రజలు ఆశతో కోరుకోవడం తాను చూశానని తెలిపారు. వారికి కావాల్సిన ఆనందాన్ని మనం ఇద్దామని.. మీ సమస్యలను నేను పరిష్కారిస్తానని మంత్రి తానేటి వనిత తెలిపారు.

వృద్ధులు, ట్రాన్స్ జండర్ లు, విభిన్న ప్రతిభావంతుల సమస్యలు ఎప్పుడూ వచ్చినా తక్షణం స్పందించాలని కోరారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవకాశం ఉన్నంత మేరకు అవసరమైన పరికరాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

ఇందు కోసం ఎన్జీవోల సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డైరెక్టర్ జీసీ కిషోర్‌కుమార్, సంబంధిత శాఖ అధికారులు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.