ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 22 జులై 2021 (20:35 IST)

కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిని క‌లిసిన సోము వీర్రాజు బృందం

ఏపీ, తెలంగాణా మ‌ధ్య జ‌ల వివాదం నేప‌థ్యంలో ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ని ఏపీ బీజేపీ బృందం క‌లిసింది. కేంద్ర మంత్రిని ఆయ‌న‌ నివాసంలో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు సారథ్యంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయ‌కులు క‌లిశారు. ఈమధ్యనే పోలవరం ప్రాజెక్టును సమీక్షించిన సోము వీర్రాజు ఆ విశేషాల‌ను జ‌ల మంత్రికి వివ‌రించారు.

పోలవరం నిర్వాసితులు, ముంపు గ్రామాలు తదితర అంశాలను కూడా కేంద్ర మంత్రికి వివరించారు. ఆర్ ఆర్ ప్యాకేజీకి సంభందించి ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఇప్పటివరకూ సాయం అందలేదని షెకావ‌త్ దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్ట్  ల స్టేటస్ వివరించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేజర్, మైనర్ ప్రాజెక్టులకు సంభందించి చర్చించారు. ఏపీలో రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చొరవ చూపి ఆ ప్రాంతానికి న్యాయం చేయాలని కోరారు.
 
విజయవాడలో జరిగిన నీటి రంగ నిపుణులు రౌండ్ టేబుల్ సమావేశంలో వారి సలహాలు, సూచనలు కూడా కేంద్ర మంత్రి కి  సోము వీర్రాజు వివ‌రించారు. కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించామ‌ని, ఆయన సానుకూలంగా స్పందించారని సోము వీర్రాజు చెప్పారు. 
 
కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో సభ్యులు సోము వీర్రాజు గారితో పాటు మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు సి.ఎం.రమేష్, టి.జి.వెంకటేష్, ఙివిల్, విష్ణువర్ధన్ రెడ్డి , పివిఎన్ మాధవ్, భానుప్రకాశ్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.