శ్రీశైలం ఘంటామఠంలో పురాతన వెండి నాణేలు...
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో అనేక మఠాలు ఉన్నాయి. ఇందులో ప్రత్యేకంగా పంచ మఠాల గురించి చెప్పుకుంటారు. ఈ మఠాల్లో ఒకటైన ఘంటామఠంలో పురాతన వెండి నాణేలు బయటపడ్డాయి. ఈ మఠం ప్రాంగణంలో చిన్న శివాలయ పునరుద్ధరణ పనులు చేస్తుండగా గోడల నుంచి పురాతన తామ్ర శాసనాలు, వెండి నాణేలు బయటపడ్డాయి.
మూడు తామ్రపత్రాలు, 245 వెండి నాణేలు లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. తామ్రశాసనాలపై నాగరి, కన్నడ లిపితో పాటు, శివలింగానికి రాజు నమస్కరిస్తున్నట్టు, నంది, గోవు చిత్రాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న దేవస్థానం ఈవో రామారావు, తహసీల్దారు రాజేంద్రసింగ్, ఎస్ఐ హరిప్రసాద్‌లు ఆలయానికి చేరుకుని వాటిని పరిశీలించారు. వెండినాణేలను 1800-1900 సంవత్సరాల మధ్య బ్రిటిష్ పాలన నాటివిగా అధికారులు గుర్తించారు. తామ్ర పత్రాలకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.