శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2020 (09:31 IST)

'శ్రీశైలం' ఫ్లాంట్‌లో సేప్టీ మెజర్స్ జీరో?? అధికారుల నిర్లక్ష్యం ఫలితమే ఈ ఘోర విపత్తా?

తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి ముందే అంటే రెండు రోజుల ముందే షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదాన్ని అక్కడి సిబ్బంది రెండు రోజుల క్రితమే గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారా? విశ్వసనీయవర్గాలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానమిస్తున్నాయి. 
 
నిపుణులను పంపి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు.. ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదని, అందువల్లే షార్ట్‌సర్క్యూట్‌ జరిగిందని ఉద్యోగులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఫలితంగా 900 మెగావాట్ల సామర్థ్యం గల హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు పూర్తిగా దగ్ధమైపోయింది. ఎంత మేర నష్టం జరిగిందని యంత్రాంగం అంచనా వేయలేదు. 
 
అంతేకాకుండా, దేశానికే తలమానికంగా ఉండే ఈ పవర్ ప్రాజెక్టులో ఎలాంటి సేఫ్టీ మెజర్సే లేవని తెలుస్తోంది. పవర్‌ ప్లాంట్‌లో ఎప్పటికప్పుడు గాలి బయటకు వెళ్లేలా ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు ఉండాలి. యూనిట్లలో ఉష్ణోగ్రత సమతౌల్యంగా ఉండేలా ఏసీల నిర్వహణ చేపట్టాలి. అత్యవసరమైనప్పుడు పవర్‌స్టేషన్‌ నుంచి సిబ్బంది తప్పించుకునేందుకు వీలుగా ఎస్కేప్‌ వేలు, అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండాలి. అవసరమైనప్పుడు వినియోగించేందుకు వీలుగా ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉండాలి. 
 
పక్కాగా అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిబంధనలు చెబుతుంటే.. రాష్ట్రానికే తలమానికమైన శ్రీశైలం పవర్‌హౌజ్‌ వద్ద మాత్రం వీటిని పాటించలేదని, అందువల్లే ఈ పెనుప్రమాదం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. సీజన్‌ ప్రారంభానికి ముందే ఉన్నతాధికారుల సమక్షంలో చేయాల్సిన తనిఖీలు నామమాత్రంగా సాగుతున్నాయని, ప్రతి షిఫ్టు ప్రారంభానికి ముందు విధిగా జరగాల్సిన తనిఖీలు జరగడం లేదని అక్కడి సిబ్బందే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇవి మాత్రమే కాదు.. అడుగడుగునా నిర్వహణ లోపం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ఇంతటి ఘోర ప్రమాదానికి, తొమ్మిది మంది మరణానికి, భారీ నష్టానికి కారణమైందని విద్యుత్‌ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిబంధనల ప్రకారం.. విద్యుదుత్పత్తి సీజన్‌ ప్రారంభానికి ముందు టర్బైన్లు, కేబుళ్లు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగాలన్నింటినీ పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలి. ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలో ట్రయల్‌ రన్స్‌ నిర్వహించిన తర్వాతే యూనిట్ల నుంచి విద్యుదుత్పాదన ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ ఉన్నతాధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకపోవడంతో ఈ ఘోర విపత్తుకు ప్రధానకారణంగా తెలుస్తోంది.