శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: ఆదివారం, 16 ఆగస్టు 2020 (13:52 IST)

పవన్ కళ్యాణ్‌లో ఏమిటీ మార్పు, జనసైనికుల్లో ఎందుకంత ఆగ్రహం?

మార్పు కోసం జనసేన పార్టీని పెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయిపోయారు. తన ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగా లేదని.. అందుకే సినిమాల్లోకి వెళుతున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. ఒకే సినిమా చేసి మళ్ళీ వచ్చేస్తానని చెప్పిన జనసేనాని వరుసగా నాలుగు సినిమాలకు ఒప్పేసుకున్నాడు.
 
మొదటి సినిమా వకీల్ సాబ్, క్రిష్ దర్సకత్వంలో వస్తున్న సినిమా. ఇక రెండవది గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో మరో సినిమా, అలాగే మూడవది రామ్ తాళ్లూరితో, ఇక నాలుగవ సినిమా కూడా పవన్ కళ్యాణ్ పచ్చ జెండా ఊపేశారు. ఒక్క సినిమా అని చెప్పి వరుస సినిమాలు పవన్ కళ్యాణ్ చేస్తుండటం అభిమానులకు సంతోషంగానే ఉన్నా జనసైనికుల్లో మాత్రం ఆగ్రహం తెప్పిస్తోందట.
 
అంతేకాదు బిజెపి నేతలను ఆలోచనలోకి పడేస్తోందట. ఇప్పటికే ఎపిలో వైసిపి బలం పుంజుకుంటోంది. రోజురోజుకు ఆ పార్టీ  ప్రజాదరణ పొందుతూనే ఉంది. ఇక టిడిపి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బిజెపి, జనసేనల మధ్య సఖ్యత కుదరడం.. రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్న తరుణంలో జనసేనాని సినిమాలు చేయడం మాత్రం బిజెపి నేతలకు ఏ మాత్రం ఇష్టం లేదట.
 
అంతకన్నా ముందు ఆవేశపూరిత ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడెందుకు సినిమాలవైపే ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. ప్రజా సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ జనసైనికులు ఆలోచనలో పడిపోయారు. 2024 ఎన్నికల్లో వైసిపిని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని జనసైనికులు భావిస్తున్నారు.
 
అలాంటిది సినిమాల్లో బిజీగా ఉంటే ఇక రాజకీయాలు చేయడం ఎలా సాధ్యమవుతుందన్న అనుమానం జనసైనికుల్లో  కలుగుతోంది. పవన్ కళ్యాణ్ కు ఈ విషయాన్ని చెప్పలేక కొంతమంది పార్టీ వదిలి అధికార పార్టీలోకి వెళ్లిపోతున్నారు. మరికొంతమంది మాత్రం పవన్ పైన అభిమానంతో ఆ పార్టీలో ఉంటూ మానసిక క్షోభను అనుభవిస్తున్నారట. దీనికంతటికీ పుల్‌స్టాప్ పడలాంటే పవన్ కళ్యాణ్ సినిమాల కన్నా రాజకీయావైపు ఎక్కువ దృష్టిపెడితే జనసైనికులు సంతోషపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.