శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (19:59 IST)

జనసేన గాలివాటం పార్టీ అని ఎక్కడా అనలేదు : ఎమ్మెల్యే రాపాక

జనసేన పార్టీ ఓ గాలివాటం పార్టీ అని, అది గాలికిపోయే పార్టీ అని తాను ఎక్కడా అనలేదని ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని కొందరు కావాలనే వక్రీకరించి వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. తనను జనసేన నుంచి సస్పెండ్ చేసినట్టు ఫేక్ న్యూస్ కూడా వస్తున్నాయని వెల్లడించారు.
 
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక కావడం గమనార్హం. ఈయన రాజోలు అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. రాపాక వరప్రసాద్ రూపంలో ఆ పార్టీకి అసెంబ్లీలో ఓ ప్రతినిధి లభించాడు. కానీ, వరప్రసాద్ సాంకేతికంగా జనసేన ఎమ్మెల్యేనే అయినా, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పైగా, జనసేన హైకమాండ్‌తో ఆయన సఖ్యత అంతంతమాత్రమే! ఈ నేపథ్యంలో రాపాక జనసేన ఓ గాలి పార్టీ అన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆయనే స్వయంగా వివరణ ఇచ్చారు.
 
జనసేన గాలికి వెళ్లిపోయే పార్టీ అని గానీ, గాలి పార్టీ అని గానీ ఎక్కడా అనలేదని స్పష్టం చేశారు. అధికార పార్టీకి సన్నిహితంగా ఉంటేనే పనులు జరుగుతాయన్నారు. ఎన్నికల ముందు చివరి నిమిషం వరకు వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించానని, కానీ బొంతు రాజేశ్వరరావు వల్ల తనకు టికెట్ దూరమైందని రాపాక వెల్లడించారు.
 
పైగా, తాను కేవలం జనసైనికుల వల్లే గెలవలేదని, జనసైనికుల ప్రభావం ఉండుంటే రాష్ట్రం మొత్తం జనసేన గెలిచుండేదని సూత్రీకరించారు. తనకు జనసైనికులతో పాటు మిగతవాళ్లు కూడా ఓట్లు వేశారని, వారికి కూడా తాను సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయాలన్నా, ప్రజలకు మంచి చేయాలన్నా ఖచ్చితంగా తాను అధికార వైకాపాకు వంతపాట పాడక తప్పదని ఎమ్మెల్యే రాపాక వ్యాఖ్యానించారు.