మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2020 (11:30 IST)

శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటే...

శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో గురువారం రాత్రి సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఒక ఏసీతో సహా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్లాంట్‌లోని పవర్ సర్క్యూట్ ప్లాంట్‌లో ఏర్పడిన విద్యుదాఘాతం కారణంగా సంభవించింది. ముఖ్యంగా, షార్ట్‌సర్క్యూట్‌ జరిగి ప్యానల్‌ బోర్డుకు చిన్నపాటి మంటలు చెలరేగాయి. ఈ మంటలను విధుల్లో ఉన్న సిబ్బంది ఆర్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. 
 
మంటలు అంటుకున్న ప్యానల్‌ బోర్డుకు రెండు వేర్వేరు మార్గాల నుంచి బ్యాటరీల నుంచి డైరెక్ట్‌ కరెంట్‌(డీసీ) అందుతుండేది. ప్రమాద సమయంలో రెండు స్విచ్‌లూ పనిచేయలేదని తేలింది. ఆ స్విచ్‌లు పనిచేసి ఉంటే... ఐదు నిమిషాల్లోపే అగ్నిప్రమాదం అదుపులోకి వచ్చి ఉండేదని నిపుణులు చెబుతున్నారు. మంటలే మరింత చెలరేగడానికి.. ప్యానల్‌ బోర్డుకు విద్యుత్తు సరఫరా అవుతుండటమే కారణమని వారు వివరిస్తున్నారు. 
 
కాగా, జెన్‌కో వర్గాలు మాత్రం నిర్వహణలో లోపాలున్నాయనే వాదనను ఖండిస్తున్నాయి. పవర్‌హౌజ్‌లో ప్రమాదం సంభవించిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించాయని, దీంతో అక్కడ ఆక్సిజన్‌ స్థాయులు పడిపోయాయని.. పొగ కమ్మేయడంతో బయటకు రాలేని స్థితి ఏర్పడి ప్రాణాలు కోల్పోయారని వారు చెబుతున్నారు. ఏదేమైనా, ఈ ప్రమాదంపై లోతైన విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.