శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (16:41 IST)

శ్రీశైలం అగ్నిప్రమాదం : చనిపోయిన ఏఈ - ఐదు మృతదేహాలు లభ్యం

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద సమయంలో 30 మంది వర్కర్లు విద్యుత్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. సర్క్యూట్ ప్యానెల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. 
 
అయితే, ప్రమాదం జరిగిన వెంటనే 30 మంది వర్కర్లలో 15 మంది ఓ టెన్నెల్ ద్వారా సురక్షితంగా బయటకు వచ్చారు. మిగిలన 15 మందిలో ఆరుగురిని సహాయక సిబ్బంది కాపాడారు. లోపలే చిక్కుకుపోయిన 9 మందిలో ఒకరి మృతదేహాన్ని ఈ మధ్యాహ్నం కనుగొన్నారు. ఆ మృతదేహం అసిస్టెంట్ ఇంజనీర్ సుందర్ నాయక్‌ది అని నిర్ధారించారు. 
 
తాజాగా మరో ఐదు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ఇంకా మరో ముగ్గురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలం మృతుల రోదనలతో కన్నీటిసంద్రాన్ని తలపిస్తోంది.

మరోవైపు, ఈ ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా సీఐడీ అడిషనల్‌ డీజీపీ గోవింద్‌సింగ్‌‌ను నియమించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 
 
ఈ సందర్భంగా శ్రీశైలం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగడం పట్ల సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. 
 
మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ మేరకు మంత్రి జగదీష్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.