శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 జూన్ 2020 (16:36 IST)

హైదరాబాద్‌లో మాయమవుతున్న కరోనా మృతదేహాలు.. ఎలా?

హైదరాబాద్ నగరంలో కరోనా మృతదేహాలు కనిపించకుండా పోతున్నాయి. ఈ మృతదేహాలను ఎవరు తీసుకెళుతున్నరన్న అంశం ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. దీంతో హైదరాబాద్ నగర్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ రంగంలోకి దిగి, మృతదేహాల మాయంపై ఆరా తీస్తున్నారు. 
 
ఇదే అంశంపై ఆయన స్పెషల్ బ్రాంచ్ అధికారులను కూడా అప్రమత్తం చేశారు. అదృశ్యం అవుతున్న మృతదేహాలపై ప్రత్యేక దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌లలో పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ బ్రాంచ్‌లో కీలకంగా విధులు నిర్వర్తించిన ఎనిమిది మంది సిబ్బందిని కమిషనర్ అంజనీ కుమార్ అభినందించారు.
 
మరోవైపు, హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. హైదరాబాద్‌లో రోజురోజుకు కొవి‌డ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంతో ప్రజలు ఇంటినుంచి బయటికి రావాలంటేనే బయపడుతున్నారు. కేవలం సామాన్యులే కాదు వైద్యులు సైతం కరోనా బారిన పడుతున్నారు. 
 
తాజా కరోనాతో ఖైరతాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు మృతి చెందాడు. ఇటీవల కరోనా నిర్ధారణ అవడంతో కిమ్స్‌ దవాఖానలో చేరిన అతను చికిత్సపొందుతూ ఆదివారం రాత్రి 8 గంటలకు మృతి చెందాడు.
 
కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా.. కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రజలు బయటికి వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, కరోనా సోకకుండా జాగ్రత్తులు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.