బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:11 IST)

భాగ్యనగరిలో "స్వచ్ఛత" కరవు : రూ.కోట్లు ఖర్చుపెట్టినా ఫలితం శూన్యం

భాగ్యనగరి (హైదరాబాద్)లో స్వచ్ఛత కరువైంది. నగర పరిశుభ్రత కోసం గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ప్రతి యేడాది కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ.. స్వచ్ఛత అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సర్వేక్షణ్ ర్యాంకుల పట్టికలో బాగా వెనుకబడిపోయింది. అయితే, గత యేడాది కంటే ఈ యేడాది భాగ్యనగరి ర్యాంకు కాస్త మెరుగుపడటం గమనార్హం. 
 
ముఖ్యంగా, కనీసం టాప్‌-20లో కూడా చోటుదక్కకపోవడం గమనార్హం. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న కేటగిరీలో 47 నగరాలతో పోటీపడిన గ్రేటర్‌ హైదరాబాద్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌ - 2020లో 23వ స్థానంలో నిలిచింది. 2019 స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో జీహెచ్‌ఎంసీ 35వ ర్యాంకు సాధించింది. గతంతో పోలిస్తే ర్యాంకు మెరుగుపడినా.. ఆశించిన ఫలితం కనిపించడం లేదు.
 
గత నాలుగేళ్లుగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో అత్యధిక మార్కులతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ సిటీ మొదటి ర్యాంకు సాధిస్తోంది. ఈసారి కూడా అన్ని కేటగిరీలలో 6,000 మార్కులకుగాను 5647.56 సాధించి మొదటి స్థానంలో ఉంది. ఓవరాల్‌ ర్యాంకింగ్‌లో 4047 మార్కులతో జీహెచ్‌ఎంసీ 23వ స్థానం దక్కించుకుంది. ఢిల్లీ (31), ముంబై (35), బెంగళూరు (37), నార్త్‌ ఢిల్లీ (43). చెన్నై (45)తో పోలిస్తే గ్రేటర్‌కు మెరుగైన ర్యాంకు దక్కిందని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. 
 
నిజానికి హైదరాబాద్ నగర పరిశుభ్రత, స్వచ్ఛతతో పాటు.. సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రోడ్లు ఊడవడం నుంచి తడి, పొడి చెత్త వేరు చేయడం, మెరుగైన పారిశుధ్య నిర్వహణ, బహిరంగ మల, మూత్రవిసర్జన రహితం, నిర్మాణ రంగ వ్యర్థాల నిర్వహణ తదితర పనుల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. 
 
తడి, పొడి చెత్త వేరు చేసేందుకు రెండు డబ్బాలు, చెత్త సేకరణ కార్మికులకు 2500 స్వచ్ఛ ట్రాలీలు అందజేశారు. రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌తో కియోస్క్‌లు, ట్విన్‌ బిన్స్‌, డాగ్‌ పార్క్‌, ఫీడ్‌ ది నీడ్‌ వసతి కల్పించారు. అదనంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. పనుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. అయినప్పటికీ ఈ యేడాది కూడా గ్రేటర్ లక్ష్యం నెరవేరలేదు.