మద్యంకు డబ్బు లేదని శానిటైజర్లు తాగిన మహిళల మృతి
అసలే కరోనా కష్టకాలం. చిత్తు కాగితాలు ఏరితే తప్ప జీవనం సాగదు. అందులోను తిండితో పాటు మద్యానికి బానిసైన ఒక కుటుంబం శానిటైజర్లు తాగడం అలవాటుగా మార్చుకుంది. నీళ్లలో శానిటైజర్లు వేసుకుని తాగడం అలవాటు చేసుకున్న ఆ కుటుంబం చివరకు మత్తు ఎక్కువ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయారు.
తిరుచానూరు సరస్వతినగర్‌కు చెందిన మల్లిక, లత, సెల్వంలు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరు గత కొన్ని సంవత్సరాలుగా తిరుచానూరు చుట్టుప్రక్కల చెత్త కాగితాలు ఏరుకుని జీవనం సాగించేవారు. కరోనా సమయంలో మూడు నెలల పాటు పోషణ కరువై ఇబ్బందులు పడ్డారు.
అయితే గత వారంరోజుల నుంచి చెత్త ఏరుకుని వచ్చిన డబ్బుతో కుటుంబం నడిచేది. దాంతో పాటు మద్యానికి బానిసయ్యారు వీరు ముగ్గురు. డబ్బులు సరిపోకపోవడంతో గత మూడురోజుల నుంచి శానిటైజర్‌ను నీళ్లలో కలుపుకుని తాగారు. మొదటి రెండురోజులు బాగానే ఉన్నా నిన్న రాత్రి శానిటైజర్లలోని రసాయానాల వల్ల మత్తు ఎక్కువై అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు.
అయితే ఈ రోజు ఉదయం కొంతమంది స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా అప్పటికే ముగ్గురు మరణించారు. మార్చురీకి మృతదేహాలను తరలించి పంచనామా నిర్వహిస్తున్నారు తిరుచానూరు పోలీసులు.