పెళ్లై నాలుగు రోజులే, నవ దంపతులను పొట్టనబెట్టుకుంది
కాళ్ల పారాణి ఆరక ముందే వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు పొట్టనబెట్టుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవదంపతులు యడవల్లి వెంకటేశ్ (30), మానస నవ్య (26)లు కన్నుమూశారు. జూన్ 14న వారి వివాహం కాగా గురువారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా గోవాడ నుంచి భార్య మానస ఆమె సోదరుడు భరత్‌తో కలిసి వెంకటేశ్ విశాఖ జిల్లా సబ్బవరానికి కారులో బయలుదేరాడు.
కారులో వెళుతుండగానే పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలోని పూళ్ల రోడ్డులో కారు అదుపుతప్పింది. వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి అవతలివైపుకు దూసుకెళ్లగా ఆ వైపు ఏలూరు నుంచి వెళ్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. దీనితో కారులో వున్న వెంకటేశ్, మానస నవ్య, భరత్, కారు డ్రైవర్ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే అటువైపు నుంచి వెళ్తున్న ఏలూరు డీఎస్పీ దిలీప్ చరణ్ క్షతగాత్రులను స్థానికుల సాయంతో తన వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే వెంకటేశ్, నవ్య, చంద్రశేఖర్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.