శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (10:16 IST)

కొంపముంచిన వలస విధానం.. ఫుట్‌పాత్‌లపై మృతదేహాలు.. ఎక్కడ?

కరోనా వైరస్ దెబ్బకు అనేక అగ్రరాజ్యాలు వణికిపోతున్నాయి. నిన్నామొన్నటివరకు అభివృద్ధి చెందిన దేశాల్లో తమ దేశం కూడా ఒకటని జబ్బలు చరిచిన దేశాలు ఇపుడు బిక్కుబిక్కుమంటు కాలాన్ని వెళ్లదీస్తున్నాయి. ఇలాంటి దేశాల్లో అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్.. ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే అనేక దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ కరోనా వైరస్ బారినపడి ఇప్పటికీ కోలుకోని పరిస్థితి నెలకొనివుంది. 
 
అలాంటి దేశాల్లో ఈక్వెడార్ కూడా ఒకటి. ఇది స్పెయిన్‌, ఇటలీ దేశాలకు పొరుగున ఉంది. పైగా ఈ రెండు దేశాలతో ఈక్వెడార్‌కు మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఈక్వెడార్ దేశ ప్రజలు స్పెయిన్‌కు భారీగా వలస వెళుతుంటారు. ఈ వలస విధానమే ఇపుడు ఈక్వెడార్‌ను కష్టాల్లోకి నెట్టింది. కరోనా వైరస్ దెబ్బకు కుదేలైపోయింది. ఈ దేశంలోని ఫుట్‌పాత్‌లపై కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి మృతదేహాలు ఎటు చూసినా కనిపిస్తున్నాయి. అక్కడ పరిస్థితులను చూసిన వారి హృదయాలు తరుక్కుపోతున్నాయి. 
 
నిర్లక్ష్యం, భౌతిక దూరాన్ని గాలికి వదిలేయడం, సామాజిక, ఆర్థిక అసమానతలు ఆ దేశాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేశాయి. ఫలితంగా మృతదేహాలు రోడ్లపైనా, ఫుట్‌పాత్‌లపైనా దర్శనమిస్తున్నాయి. శవపేటికలు కూడా దొరకని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఈక్వెడార్ వాసులు ఎక్కువగా స్పెయిన్, ఇటలీలకు వలస వెళ్తుంటారు. ఇప్పుడదే వారి కొంప ముంచింది. స్పెయిన్, ఇటలీ దేశాలు కరోనాకు కేంద్రంగా మారిన నేపథ్యంలో అక్కడనున్న ఈక్వెడార్ విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఓవైపు వైరస్ విజృంభిస్తుంటే మరోవైపు ఈక్వెడార్‌లోని సంపన్నుల ఇంట్లో పెళ్లిళ్లు జరగడం, వందలాదిమంది హాజరు కావడంతో వైరస్ ఒక్కసారి విస్తరించి, ఇది మురికివాడలకు సైతం పాకింది. 
 
వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కఠిన ఆంక్షలు విధించిన ఈక్వెడార్ ప్రభుత్వం ప్రజలకు 60 వేల డాలర్లు ఇస్తామని ప్రకటించింది. అయితే, పూటగడవని పేదలు కడుపు నింపుకునే మార్గం లేక పనులకు వెళ్లి వైరస్ బారినపడి తనువు చాలిస్తున్నారు. మరికొందరు ఆహారం కోసం భిక్షాటన చేస్తూ వైరస్‌ను అంటించుకుంటున్నారు. 
 
ఇక, ఈక్వెడార్‌లో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 70 శాతానికి పైగా గ్వాయస్ ప్రావిన్స్‌లోనే నమోదయ్యాయి. ఇక్కడ అధికారులు చెబుతున్న దానికి కొన్ని రెట్లు అధికంగా మరణాల సంఖ్య ఉంటుందని అంతర్జాతీయ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.