శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 11 మార్చి 2020 (20:26 IST)

ద్వారకా తిరుమల సందర్శించండి: గవర్నర్‌కు ట్రస్టు బోర్టు సభ్యురాలు శ్రీవల్లి వినతి

తెలుగు వారి నోట చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనకు విచ్చేయాలంటూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ట్రస్టు బోర్డు సభ్యురాలు డాక్టర్ మాటూరి శ్రీ వల్లి రంగనాధ్ ఆహ్వానం పలికారు. బుధవారం విజయవాడ రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన శ్రీవల్లి రంగనాధ్ ఈ మేరకు విన్నవించారు. ఎంతో చరిత్ర కలిగిన దేవస్ధానానికి అరుదెంచి స్వామి వారి ఆశీర్వాదం అందుకోవాలని పేర్కొన్నారు. 
 
ఇటీవలి ట్రస్టు బోర్డు నియామకం ద్వారా తనకు స్వామి వారి సేవ చేసుకునే అవకాశం లభించిందని వివరించిన డాక్టర్ మాటూరి శ్రీవల్లి రంగనాధ్, తమ కుటుంబం నేతృత్వంలోని అమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 12 సంవత్సరాలుగా విద్య, వైద్యం, సాంస్కృతిక రంగాలలో విభిన్న సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని గౌరవ గవర్నర్‌కు వివరించారు. అమ్మ ట్రస్ట్ తరుపున నేటి యువతకు స్పూర్తి కలిగించేలా విభిన్న రంగాలలో సేవలు అందించిన ప్రముఖులను ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా సన్మానిస్తున్నామని తెలిపారు. 
 
40 మంది చిరువర్తకులకు వారి వ్యాపార అభివృద్ధి కోసం ద్విచక్రవాహనాలు పంపిణీ చేసామని, ఇప్పటివరకు రాష్ట్రంలోని 50 దేవాలయాలకు నిత్యాన్నదానం పధకం కింద రూ.50 లక్షలు విరాళంగా అందించామని పేర్కొన్నారు. తమ ట్రస్టు నిర్వహించే సాంవత్సరిక వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఈ సందర్భంగా శ్రీవల్లి రంగనాధ్ గౌరవ గవర్నర్‌కు విన్నవించారు. ఆహ్వానించేందుకు వచ్చినవారిలో ట్రస్ట్ ఛైర్మన్, అమ్మ కన్స్ట్రక్షన్స్ అధినేత మాటూరి రంగనాధ్, బచ్చు పిచ్చేశ్వర గుప్తా, కాకి సురేష్ కుమార్ తదితరులు వున్నారు.