మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 7 జనవరి 2020 (05:51 IST)

ఏపీలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు

ఆంధ్రప్రదేశ్ లో 'స్కిల్ యూనివర్శిటీ' ఏర్పాటుపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన  సమీక్ష సమావేశం జరిగింది.  స్కిల్ యూనివర్శిటీ స్థాపనకున్న సాధ్యాసాధ్యాలు, అనువైన మార్గాలపై  ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంయుక్తంగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష  సమావేశంలో  ఏ భాగస్వామ్య పద్ధతిలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయొచ్చు, ఏ మార్గంలో వెళితే ఆర్థిక భారం లేకుండా ఎక్కువ మంది యువతకు శిక్షణ , ఉపాధి అందించవచ్చు.

ఏపీలో  ప్రస్తుతం అందిస్తోన్న శిక్షణలు, ఏపీఎస్ఎస్డీసీ బృందం  దేశవ్యాప్తంగా ఉన్న స్కిల్ యూనివర్శిటీలను సందర్శించి సేకరించిన సమాచారాన్ని ఇరువురు  మంత్రులకు ఉన్నతాధికారులు వివరించారు.

ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ దేశంలోని ఇతర నైపుణ్య విశ్వవిద్యాలయాల ఏర్పాటు, వ్యయం, అక్కడ యువతకు నేర్పించే శిక్షణ, పూర్తిగా ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటైనది ఏది, ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో స్థాపించినది ఏ విశ్వవిద్యాలయం వగైరా విషయాలపై ఆరా తీశారు. 

ఏ సంవత్సరంలో ఏ విశ్వవిద్యాలయం స్థాపించారు, వాటి ప్రస్తుత పరిస్థితి, అక్కడ వసతి వంటి విషయాలను స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖ ప్రధాన కార్యదర్శి జి.అనంత రాము, ఎండీ శ్రీకాంత్ మంత్రులకు వివరించారు. పార్లమెంటు నియోజకవర్గానికో స్కిల్ కాలేజ్ ఏర్పాటు, ఆ జిల్లాలోని ప్రాధాన్యతలను బట్టి శిక్షణనివ్వవలసిన కోర్సుల వివరాలను సిద్ధం చేసినట్లు శ్రీకాంత్ వెల్లడించారు.

ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఎండీ శ్రీకాంత్ ఇటీవల హర్యాణా రాష్ట్రంలోని శ్రీ విశ్వకర్మ విశ్వవిద్యాలయం, రాజస్థాన్ రాష్ట్రంలోని భట్రియా విశ్వవిద్యాలయం, ఒడిశాలోని సెంచూరియన్, గుజరాత్ లోని టీమ్ లీజ్ స్కిల్ యూనివర్శిటీలను సందర్శించిన సందర్భంలో తెలుసుకున్న కీలక విషయాలను , స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్శిటీలకు కేటాయించిన స్థలం, స్థాపించిన సంవత్సరం, అక్కడ కోర్సులకు వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను మంత్రులకు స్పష్టం చేశారు.
 
'స్కిల్ గ్యాప్' పై పరిశ్రమల శాఖ  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సూచనలు...
సింగపూర్ లో యువతకు అందించే విద్య విధానంపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రీ గ్యాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పద్ధతుల్లో అక్కడి విద్యార్థులు చదువుకునే పద్ధతిని గురించి మంత్రి సమావేశంలో చర్చించారు.

రకరకాల సమస్యలు, కారణాలతో యుక్త వయసులో చదువుకోలేపోయిన వారు తర్వాత కాలంలోనూ చదువును పూర్తి చేసుకునే అవకాశమున్న పద్ధతులను తీసుకురావాలన్నారు. చదువుకు కొన్నాళ్లు దూరమైనా, వాళ్ళ చదువు, జ్ఞానాన్ని బట్టి రెగ్యులర్ గా చదివే వారితో సమానంగా స్కిల్ ను నేర్చుకునే సులభతర పద్ధతులను , వారితో సమానంగా మంచి ఉద్యోగాలను పొందే అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చే అవసరాన్ని మంత్రి మేకపాటి వెల్లడించారు.

ఈ సందర్భంగా 'నైపుణ్య కొరత'ను అధిగమించేందుకు అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచనలిచ్చారు. తిరుపతిలో, విశాఖపట్నంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయదలచుకున్న నైపుణ్య విశ్వవిద్యాలయాల ప్రాముఖ్యతపై మంత్రి అధికారులతో చర్చించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సహా  ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, నైపుణ్యాభి వృద్ధి , శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అనంత రాము, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లావణ్య వేణి, ఐ.టీ & సీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సుందర్, ఐ.టీ శాఖ జాయింట్ సెక్రటరీ సుర్జిత్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ శ్రీకాంత్, సీడాప్ సీఈవో మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.