శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2019 (11:15 IST)

జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు క‌చ్చితంగా పాటించండి: ఎల్వీ

పట్టణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్ధ పదార్ధాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తు.చ‌. తప్పక పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు.

జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలపై గురువారం అమరావతి సచివాలయంలో మున్సిపల్ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఇంటింటా ఘన, ద్రవ వ్యర్ధాల సేకరణను చేపట్టి వాటిని సక్రమంగా కంపోస్టుగా తయారు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఎన్జీటి ఇచ్చిన ఆదేశాలను ఎప్పటిలోగా అమలుచేసేది స్పష్టంగా తెలియజేయాలని ఇందుకు ప్రతి అంశానికి సంబంధించిన నిర్ధిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆప్రకారం ఆ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి పట్టణంలో ప్లాస్టిక్ పొట్లాల్లో ఆహార పదార్థాలను విక్రయించే సంస్థల నుండి కొంత మొత్తాన్ని సేకరించి ఆమొత్తాన్ని పర్యావరణ పరిరక్షణకు వ్యయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.

మున్సిపల్ శాఖ కమీషనర్ జిఎస్ఆర్కె విజయకుమార్ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా అన్ని పట్టణాల్లో ఇంటింటా చెత్తసేకరణ వాటి సక్రమ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 36 లక్షల పట్టణ గృహాలకు గాను 28లక్షల 79వేల గృహాల్లో వ్యర్ధ పదార్ధాల సెగ్రిగేషన్ ప్రక్రియను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.

వేస్ట్ కలక్టన్ కు సంబంధించి డిశంబరు నెలాఖరులోగా ఆన్ లైన్ మానిటరింగ్ ఆఫ్ వేస్ట్ కలక్షన్ ప్రక్రియను పూర్తిగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అలాగే వేస్ట్ టు ఎనర్టీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాని వివరించారు. ఇప్పటికే గుంటూరులో ఈ విధమైన ప్లాంట్ ఏర్పాటు కాగా విశాఖపట్నంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఎపిటిడ్కో ఎండి దివాన్ మైదీన్ తదితరులు పాల్గొన్నారు.