సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (09:00 IST)

విదేశీ విద్యాభ్యాసానికి విద్యార్థి లక్ష్యసాధనే కీలకం: ఏపీ ప్రభుత్వ విదేశీ విద్య సలహాదారు

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ధనిక, పేద అనే తేడా లేదని, విద్యార్థి లక్ష్య సాధనే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విదేశీ విద్య సలహాదారు డాక్టర్ కుమార్ అన్నవరపు అన్నారు. విజయవాడ  ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అమెరికాలో ఉన్నత విద్య పై ఇష్టాగోష్టి కార్యక్రమం నిర్వహించారు.

దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన కుమార్ మాట్లాడుతూ విదేశీ విద్య అభ్యసించడానికి విద్యార్థులకు తొలుత అవగాహన అవసరమని, ఆ తర్వాత వారు అనుకున్న లక్ష్య సాధనకు పట్టుదల ముఖ్యమన్నారు. డబ్బులున్నవారు మాత్రమే విదేశాల్లో చదువుకోగలరన్నది కేవలం అపోహ మాత్రమేనన్నారు.

దీనికి హైదరాబాద్ నుంచి ఒక అంధుడు రూపాయి ఖర్చు లేకుండా అమెరికాలోని ఒక ప్రముఖ యూనివర్సిటీలో విద్యనభ్యసించడం, ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చి పెద్ద కంపెనీ ప్రారంభించి కోట్లకు పడగలెత్తి, వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన  విషయాన్ని ఉదాహరించారు. అమెరికాలో దాదాపు నాలుగు వేలకు పైగా యూనివర్సిటీలు ఉన్నాయని, వీటిలో 350కు పైగా యూనివర్సిటీలు స్కాలర్  షిప్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

విద్యార్థి తన కోర్సుకు దేనిలో చేరాలో ముందు అవగాహన కలిగి ఉంటే ప్రవేశం సులువు  అవుతుందన్నారు. అలాగే మీకు ఏ యూనివర్సిటీ ప్రవేశం కల్పిస్తుందో ఆ సంస్థ నుంచి  ఐ-20  పామ్ అందుతుందని,  ఇది అమెరికా వీసా పొందడానికి, ఆ దేశంలో ఒక విద్యా సంస్థ నుంచి మరొక విద్యాసంస్థకు మారడానికి ఉపయోగపడుతుందని చెప్పారు.

అయితే ఐ-20 ఫామ్ పంపిన యూనివర్సిటీకి సెవిస్ ఆమోదం ఉందో లేదో తెలుసుకోవాలని, దానివల్ల వీసా మంజూరులో ఎటువంటి ఇబ్బందులు ఉండవని వివరించారు. వీటన్నింటిపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పేద, బడుగు, బలహీనవర్గాలకు సైతం విదేశీ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో ప్రత్యేకంగా విదేశీ విద్య విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

విదేశీ యూనివర్సిటీలు, రాష్ట్ర విద్యార్థులకు మధ్య ఇది ఒక అనుసంధాన కర్తగా వ్యవహరిస్తూ వారి ఆశయ సాధనకు దోహదపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టు  ఈ అవకాశాన్ని  అందిపుచ్చుకోవాలని, తాను  కూడా స్వతహాగా జర్నలిస్టు నైనందున  తన వంతు సహాయం అందజేస్తానని  హామీ ఇచ్చారు.

ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్షులు చావా రవి, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కోటిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం కుమార్ ని దుశ్శాలువ, మెమొంటోతో జర్నలిస్టు సంఘ నేతలు ఘనంగా సత్కరించారు.