సాహితీ విరించి సిరివెన్నెల సీతారామశాస్త్రికి సీజె రమణ శ్రద్ధాంజలి
పాటల ఘనాపాటి సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ స్పందించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక లేరు అని తెలిసి ఎంతో విచారించానని ఆయన తెలిపారు.
తెలుగు సినీ నేపథ్య గీతాల్లో సాహిత్యం పాలు తగ్గుతున్న తరుణంలో సీతారామ శాస్త్రి ప్రవేశం పాటకు ఊపిరులూదిందని ఎన్వీ రమణ పేర్కొన్నారు. నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో, తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు సీతారామశాస్త్రి అని కొనియాడారు. సాహితీ విరించి సీతారామశాస్త్రికి తన శ్రద్ధాంజలి తెలిపారు. వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, లక్షలాది అభిమానులకు తన సానుభూతి తెలియజేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ చెప్పారు.
వివిధ సంగీత, సాహిత్య కార్యక్రమాల్లో తాను పాటల ఘనాపాటి సిరివెన్నెల సీతారామశాస్త్రిని కలిశానని, ఆయన పాటకు తాను ఎంతో మంత్ర ముగ్ధుడిని అవుతానని ఆయన తెలిపారు. ఆయన హఠాన్మరణం తనకు ఎంతో బాధ కలిగించిందని, కుటుంబ సభ్యులకు తన విచారాన్ని వ్యక్తం చేశారు.