టీవీ9 రవిప్రకాష్‌కు సుప్రీంలో చుక్కెదురు : ఏ క్షణమైనా అరెస్టు??
టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పైగా, 41ఏ సెక్షన్ కింద విచారణకు హాజరుకావాల్సిందేనంటూ తేటతెల్లం చేసింది.
ఫోర్జరీ, డేటా చోరీ తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ విచారణకు రావాల్సిందిగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం నోటీసులు జారీ చేసింది. కానీ, ఆయన విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అదేసమయంలో ఆయనకు ఇచ్చిన గడువు కూడా ముగిసిపోయింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా, దాన్ని హైదరాబాద్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టులో సోమవారం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు ఆలకించిన కోర్టు.. ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అదేసమయంలో 41ఏ సెక్షన్ కింద విచారణకు హాజరుకావాల్సిందేనంటూ స్పష్టంచేసింది. అయితే, అరెస్టు చేయదలిస్తే 48 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన చేసింది.
దీంతో రవిప్రకాష్‌కు ముందున్న అన్నిదారులు మూసుకునిపోయాయి. ఫలితంగా ఆయన్ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారనే విషయాన్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.