శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2020 (08:15 IST)

ఇసుక అక్రమ రవాణా జరగకుండా నిఘా: మంత్రి పెద్దిరెడ్డి

రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రభుత్వం ప్రారంభించిన ఇసుక పాలసీని పకడ్భందీగా అమలు చేయాలని రాష్ట్ర గనులు, భూగర్భశాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు.

విజయవాడలోని ఎపిఎండిసి కార్యాలయంలో మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామ్ గోపాల్, ఎపిఎండిసీ విసి అండ్ ఎండి  ఎం.మధుసూదన్ రెడ్డిలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎపిఎండిసి లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో వివిధ జిల్లాల్లోని ఇసుక క్వారీలు, శాండ్ స్టాక్ పాయింట్లు, చెక్ పోస్ట్ లలో ఏర్పాటు చేసిన సిసి కెమేరాల ఫుటేజీని మంత్రి పరిశీలించారు.

చెక్ పోస్ట్ లు, స్టాక్ పాయింట్ ల నుంచి లారీల్లో ఇసుక తరలిపోతున్న పరిస్థితి, దానిని ఏరకంగా తనిఖీ చేస్తున్నారనే అంశాలను స్వయంగా పర్యవేక్షించారు. అన్ని చెక్ పాయింట్ ల వద్ద సిబ్బంది అప్రమత్తంగా వుండాలని, ఎక్కడా ఇసుక నిర్ధేశించిన ప్రాంతాలకు తప్ప బయటకు వెళ్లడానికి వీలు లేదని అధికారులను ఆదేశించారు.

ప్రతి లారీకి జీపిఎస్ పరికరాలను అమర్చడం, డోర్ డెలివరీ ద్వారా ఇసుక తరలి వెళ్ళేలా చూడాలని సూచించారు. 
ఈ సందర్బంగా రాష్ట్రంలో మైనింగ్ ప్రాజెక్ట్ లపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షించారు. హెవీ మినరల్ బీచ్ శాండ్ ప్రాజెక్ట్ పై కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దీనిలో మూడు లీజ్ లకు గ్రాంట్ ఆర్డర్ లు, ఇతర ఏరియాలకు ఏపీఎండీసీ ద్వారా రిజర్వేషన్ అనుమతులను  పొందటానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగంపేట బైరటీస్ గనుల కోసం భూసేకరణను త్వరితగతిన పూర్తీ చేయాలని, రైతులకు, భూయజమానులుకు చెల్లించాల్సిన పరిహారంను జిల్లా కలెక్టర్ ద్వారా జాప్యం లేకుండా అందచేయాలని అన్నారు.

దీనిపై రెవెన్యూ అధికారులతో ఎప్పటికప్పుడు సమయన్వం చేసుకోవాలని సూచించారు. బైరటీస్ నిల్వల వెలికితీత,  అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ లపై చర్చించారు. బైరటీస్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రకాశం జిల్లాలోని తక్కువ గ్రేడ్ ఐరన్ ఓర్ నిల్వలలు వున్న భూములను ఇళ్ళ స్థలాల కోసం కేటాయిస్తున్నారనే సమాచారం మేరకు సదరు జిల్లా కలెక్టర్ కు మైనింగ్ శాఖ నుంచి సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు.

మైనింగ్ భూములను ఇతర అవసరాలకు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇళ్ళ స్థలాలకు ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలనే అంశాన్ని రెవెన్యూ అధికారులకు సకాలంలో నివేదించాలని కోరారు. ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి గాలక్సీ గ్రానైట్ కు తొందరగా టెండర్లు పిలిచి రైసింగ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఖాళీగా వున్న గనుల్లో ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 

ఖనిజ తవ్వకాలకు సంబంధించి ఎపిఎండిసి వద్ద పెండింగ్ లో వున్న దరఖాస్తులను పరిశీలించారు.  ఏఏ దశలలో సదరు దరఖాస్తులు ఉన్నాయో తెలుసుకున్నారు. ప్రత్యేకంగా ఖనిజ ఆదాయం పెంచటానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే నెల్లూరు జిల్లాలో ఏపీఎండీసీకి చెందిన సిలికా సాండ్ ప్రాజెక్ట్ ను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

దీనికి వచ్చేనెల 31ని తుది గడువుగా పరిగణించాలని అన్నారు. ప్రాజెక్ట్ నిర్వహనకు అవసరమైన సీసీటీవీలు, వే బ్రిడ్జ్లు, సిబ్బంది ఏర్పాటు తదితర అవసరాలపై అంచనాలను తయారు చేసి వెంటనే అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఏపీఎండీసీ కి ఇతర రాష్ట్రాలలో ఉన్నబొగ్గుగనులపై పూర్తీ స్థాయి సమీక్ష నిర్వహించారు.

మధ్యప్రదేశ్ లోని  సులియారి కోల్ బ్లాక్, చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని మదన్ పూర్ కోల్ బ్లాక్ లలో  బొగ్గు నిల్వలు, ఉత్పత్తి పరిస్థితిని గురించి చర్చించారు. మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ ఉత్పత్తి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.