శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2019 (15:21 IST)

అసెంబ్లీ న్యూస్ : సన్నబియ్యం కాదు.. స్వర్ణరక బియ్యం : మంత్రి శ్రీరంగనాథరాజు

ఏపీ శాసనసభలో బియ్యం మీద అధికార ప్రతిపక్షాల మధ్య చర్చ సాగుతూ ఉండటంతో.. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జోక్యం చేసుకున్నారు. ఈ అంశంపై సభలో మాట్లాడే హక్కు మంత్రి శ్రీరంగనాథ రాజుకే ఉందని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. శ్రీరంగనాథరాజు పశ్చిమ గోదావరి జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడు అని సీఎం వివరించారు. రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరంగనాధరాజు ఏం చెబుతారో విందాం అని సీఎం అన్నారు.
 
ఆ తర్వాత బియ్యం అంశంపై మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు మాట్లాడుతూ.. బియ్యంలో రెండు రకాలు ఉన్నాయని వివరించారు. ఒకటి సన్నబియ్యం, రెండోది దొడ్డ బియ్యం అని ప్రజలు అంటారన్నారు. ఎంబీయు7029, 1121 అంటే సన్నబియ్యం రకాలు అని 1001, 1010 అనేవి దొడ్డ బియ్యం, బోండాలు అంటారని మంత్రి తెలిపారు. 1998లో చంద్రబాబు నాయుడు 1001ను ప్రజలు తింటానికి ఇష్టపడటం లేదని బ్యాన్ చేశారని మంత్రి గుర్తు చేశారు. 1001 రకం రైతులకు లాభసాటి కాబట్టి ఇప్పటికీ శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణలో ఎక్కువ మంది రైతులు ఈ రకాన్ని సాగు చేస్తున్నారని తెలిపారు. 
 
దొడ్డు బియ్యం ఇవ్వకుండా స్వర్ణ బియ్యం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈస్ట్‌ గోదావరి సివిల్‌ సప్లయిస్‌ గోడౌన్స్‌లో స్టాక్‌ ఉంటే.. సీఎం, కేబినెట్‌ సభ్యులు కూర్చొని బియ్యం ఎక్కడుందో షార్ట్‌అవుట్ చేసి ఈస్ట్‌, వెస్ట్‌ గోదావరి మిల్లర్లను రిక్వెస్ట్‌ చేయటం జరిగిందని మంత్రి తెలిపారు. మిల్లర్లు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 12 వేల టన్నులు మిల్లింగ్‌ చేసి ఇవ్వటం జరుగుతోందని తెలిపారు. ఏప్రిల్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చేందుకు మిల్లర్లు ముందుకు వచ్చారని వివరించారు. 
 
ప్రభుత్వం కూడా ఖరీఫ్ నుంచి 1001 రకాన్ని మానేసి 7029 స్వర్ణ రకాన్ని, 1121 సాగు చేయాలని అనుకోవటం జరిగిందన్నారు. ఇంతకుముందు ప్రజలకు ప్రభుత్వం కేజీ బియ్యాన్ని రూపాయికి ఇస్తే ఆ బియ్యాన్ని రూ.14-15లకు అమ్మేస్తున్నారు. ప్రజలు తింటానికి ఇచ్చిన బియ్యం వారికి ఉపయోగపడకుండా చివరకు అదే రీసైక్లింగ్‌ అవుతోంది. రీసైక్లింగ్ కాకుండా సీఎం ఆలోచించారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి వారు తింటానికి మంచి పథకాన్ని వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. 
 
ఇప్పటికే ప్రతి జిల్లాలో స్వర్ణ బియ్యాన్ని 25 లక్షల టన్నులు రాబోయే రోజుల్లో ఇవ్వటం కోసం ప్రణాళికలు సిద్ధం చేయటం జరిగింది. దీన్ని అనవసరంగా రచ్చ చేయవద్దు అని సూచించారు. బీపీటీ రకాలు వల్ల షుగర్‌ సమస్య ఉందని ప్రజలు కూడా 7029 రకాన్ని ఇష్టపడుతున్నారని మంత్రి తెలిపారు. మన రాష్ట్రంలోనే కాకుండా బీహార్‌, బెంగాల్‌, ఇతర రాష్ట్రాల్లో ఈ రకాన్ని పండిస్తున్నారు. స్వర్ణ వెరైటీనే సన్నబియ్యం అంటారని మంత్రి వివరించారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం విజయవంతం అవుతుందని చెరుకువాడ శ్రీరంగనాథ రాజు తెలిపారు.