బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 మార్చి 2020 (14:59 IST)

మనుషులను చంపేస్తూ రాజకీయాలు చేస్తారా? చంద్రబాబు ఫైర్

టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ వర్గీయులు దాడికి యత్నించిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. బుధవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... 'రాష్ట్రంలో ఎవరూ బతకడానికి వీళ్లేదా? మనుషులను చంపేస్తూ రాజకీయాలు చేస్తారా? వాళ్లిద్దరు చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు' అని ప్రశ్నించారు.
 
తమ నేతల కారును వెంబడించి దాడి చేశారని చంద్రబాబు తెలిపారు. కశ్మీర్‌, బిహార్‌లోనూ ఎన్నడూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి దాడి చూడలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో స్వేచ్ఛ లేదా? అని ప్రశ్నించారు.
 
వెల్దుర్తి సీఐ కారును అడ్డగించారు. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో చూస్తున్నాం. పంచాయతీ కార్యదర్శులను కూడా బంధిస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి గెలవాలనుకుంటున్నారు. మాచర్లలో దాడిపై డీజీపీ సమాధానం చెప్పాలి. ఇంత జరుగుతున్నా ఆయనకు చీమకుట్టినట్లయినాలేదు. మాట్లాడితే ఎదురుదాడి చేస్తారా? నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
గౌతమ్‌ సవాంగ్‌కు ఏపీ మాజీ చంద్రబాబు లేఖ 
పీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు ఏపీ మాజీ చంద్రబాబు లేఖ రాశారు. నామినేషన్ కేంద్రాల్లో భద్రత ఏర్పాటు చేయాలని, కొందరు పోలీసులు వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా వైసీపీ నేతలు అడ్డుకుంటుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కొందరు పోలీసుల తీరుతో ఓటర్లు నమ్మకం కోల్పోతున్నారని, నామినేషన్‌ కేంద్రాల వద్ద పోలీస్‌ ఔట్‌పోస్ట్‌లు పెట్టాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతిపక్షం ఇచ్చే ప్రతి ఫిర్యాదు పట్ల పోలీసులు స్పందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.