అమరావతిలో రోజా కారు వెంటబడ్డ మహిళలు, బాబుకి వార్నింగ్
అమరావతిలో మహిళలు రోజాను అడ్డుకున్నారు. దీనిపై ఏపీఐఐసి చైర్మన్ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపైన దాడికి యత్నించింది టీడీపీ గూండాలేనంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇలాంటి కుళ్లు రాజకీయాలను ఇప్పటికైనా మానుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. తమను ఇలా అడ్డుకుంటే మున్ముందు చంద్రబాబు యాత్రలను అడ్డుకునే పరిస్థితులు వస్తాయని అన్నారు. అసలు అమరావతి రైతులను చేసింది వైసీపీ కాదనీ, తెదేపా మోసం చేసిందని అన్నారు.
అమరావతిలోని నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన రోజాను కొందరు మహిళలు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మహిళలతో పాటు రైతులు కూడా ఆందోళన చేస్తుండటంతో పోలీసులు అప్రమత్తమై వెంటనే అక్కడికి చేరుకుని రోజాను వెనుక గేటు నుంచి పంపారు. ఇది తెలుసుకున్న కొందరు మహిళలు రోజా కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు పరుగులు తీశారు. ఇంతలో పోలీసులు వారిని అడ్డగించారు.