శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , గురువారం, 21 అక్టోబరు 2021 (10:12 IST)

ఎంపీ రఘురామ కృష్ణ రాజు టైప్ లో వేధిస్తారేమో! ప‌ట్టాభి వీడియో రిలీజ్ !!

డ్ర‌గ్స్ విష‌యంలో మాట్లాడుతూ, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని దుర్భాష‌లాడార‌ని టీడీపీ నేత ప‌ట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి ఆయ‌న ఇంటి త‌లుపులు బ‌ద్ద‌లుకొట్టి మ‌రీ ఆయ‌న్ని అరెస్టు చేశారు. అయితే, బ‌య‌ట పోలీసు బ‌ల‌గాలు మోహ‌రించి ఉండ‌గా, ప‌ట్టాభి లోప‌ల ఓ వీడియోను తీసుకున్నారు. నిక్క‌రు, టీష‌ర్టుతో నిల‌బ‌డి తాను స్వ‌యంగా మాట్లాడుతూ, త‌న బాడీ పార్టులు  అన్నీ బాగానే ఉన్నాయ‌ని ప్ర‌త్య‌క్షంగా అంద‌రికీ చూపించే ప్ర‌య‌త్నం చేశారు.
 
 
విజయవాడలోని త‌న నివాసంలో  టీడీపీ నేత పట్టాభి ఈ సంచలన వీడియో తీసి, బ‌య‌ట‌కు విడుదల చేశారు. తనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముంద‌ని చెపుతూ, పట్టాభి వీడియో తేదీ, సమయం కూడా చూపించి, తన ఒంటిపై ప్రస్తుతం ఎలాంటి గాయాలు లేవని చెప్పారు. పోలీసు కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని పట్టాభి ఆందోళన వ్య‌క్తం చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఉదంతం నేపథ్యంలో వీడియో విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. క‌స్ట‌డీకి ముందు త‌న ఒంటిపై ఒక్క గాయం కూడా లేద‌ని, త‌ర్వాత చిన్న గీత ప‌డినా దానికి ఏపీ పోలీసులు, సీఎం జ‌గ‌న్ బాధ్య‌త వ‌హించాల్సి వ‌స్తుంద‌ని ప‌ట్టాభి పేర్కొన్నారు.  
 
తాను ఎలాంటి తప్పు చేయలేదని, కోర్టుల‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని వీడియోలో వెల్లడించారు. తనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా పోలీసులదే బాధ్యత అన్న పట్టాభి, తాను కేవ‌లం గంజాయి, మాద‌క‌ద్ర‌వ్యాల‌పై ప్ర‌శ్నించినందుకే ఈ నిర్బంధం చేస్తున్నార‌ని, ఇది స్టేట్ స్పాన్స‌ర్డ్ టెర్ర‌రిజం అని పేర్కొన్నారు.