మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 మే 2020 (17:34 IST)

'అమ్మ ఒడి పథకం' డబ్బులు - 'నాన్న గొంతు తడి'కే ఖర్చయిపోతున్నాయ్...

కిరాణా షాపులు మూసివేయించి, మద్యం దుకాణాలు తెరిచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇపుడు సర్వత్రా విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం లాక్‌డౌన్ అమలు చేస్తోంది. అయితే, మంచి పనుల కోసం లాక్‌డౌన్ ఆంక్షలను కేంద్రం సడలించింది. అదేసమయంలో గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది. 
 
దీంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ముఖ్యంగా, ఏపీలో పలు ప్రాంతాల్లో సామాజిక భౌతికదూరాన్ని పాటించకుండా మద్యబాబులు వైన్ బాటిళ్ళ కోసం ఎగబడిన దృశ్యాలను పలు టీవీ ఛానెళ్లు ప్రసారం చేశాయి. మందు బాబుల క్యూలైన్లు కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేరకు దర్శనమిచ్చాయి. ఈ దృశ్యాలపై విపక్ష పార్టీలు తమదైనశైలిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. 
 
ముఖ్యంగా, టీడీపీ ఎంపీ ఎంపీ కేశినేని నాని ఓ ట్వీట్ చేశారు. 'అమ్మ ఒడి' పథకం డబ్బులు 'నాన్న గొంతు తడి' పథకం కోసం ఖర్చయిపోతున్నాయని అమ్మలు వాపోతున్నారు జగనన్నా అంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు ఆయన మరో ట్వీట్‌లోనూ విమర్శనాత్మకంగా స్పందించారు. 
 
లాక్‌డౌన్ నేపథ్యంలో హోటళ్లు లేవని, టీ దుకాణాలు, కాఫీ షాపులు అన్ని మూతపడినా, జగనన్న మందు షాపులు మాత్రం ఫుల్ టైమ్ ఓపెన్ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక ఈ రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలని వ్యాఖ్యానించారు.