ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 మే 2020 (13:31 IST)

ధరలు పెంచినా వెనక్కి తగ్గని తాగుబోతులు.. వైన్ షాపుల ఎదుట భారీగా క్యూ

లాక్‌డౌన్ సడలింపులతో పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో మాత్రం ఈ మద్యం ధరలను ఒక్కసారిగా విపరీతంగా పెంచేశారు. కరోనా ఫీజు పేరుతో ఢిల్లీలో ఏకంగా 70 శాతం ధరలు పెంచారు. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలుత 25 శాతం ధరలు పెంచారు. ఈ ధరలు పెంచి 24 గంటలు తిరగకముందే మరో 50 శాతం అంటే.. ఏకంగా 75 శాతం ధరలు పెంచేశారు. అయినప్పటికీ మద్యం దుకాణాల ఎదుట తాగుబోతులు బారులుతీరారు. 
 
అయితే, పలు ప్రాంతాల్లో మద్యం బాబులు సామాజిక భౌతిక దూరాన్ని పాటిస్తూ వరుస క్రమంలో నిల్చోగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ సామాజిక భౌతిక దూరం మచ్చుకైనా కనిపించడం లేదు. 
 
ఒకరిపై ఒకరు పడుతూ లైన్లలో నిల్చుంటున్నారు. లాక్‌డౌన్ గైడ్‌లైన్స్ ఉల్లంఘనలు జరిగితే వైన్‌షాపుల యజమానులదే బాధ్యతని అధికారులు హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో టోకెన్ల పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. 
 
మరోవైపు మద్యం ధరల పెంపునకు గల కారణాలను ఏపీ సర్కారు వివరణ ఇచ్చింది. సంపూర్ణ మద్య నిషేధంలో భాగంగానే ధరలను పెంచినట్టు తెలిపింది. కాగా, ప్రస్తుత ఏపీ సర్కారు ఆధీనంలో 3,468 మద్యం దుకాణాలు ఉండగా, మద్యం వ్యసనాన్ని తగ్గించేందుకు వీలుగా ఈ నెలాఖరునాటికి 15 శాతం మేరకు షాపులను మూసివేయనున్నారు. 
 
ఇదిలావుంటే, మంగళవారం మద్యం షాపులు తెరుచుకోలేదు. మద్యం అమ్మకాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు  ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉదయమే ఓ ప్రకటన విడుదల చేసింది. అమ్మకాలు మళ్లీ ఎప్పట్నుంచి ప్రారంభించాలనే దానిపై తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు నిలిపివేయాలని కమిషనర్‌ తెలిపారు. 
 
మద్యం షాపుల వద్ద రద్దీని తగ్గించడం, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంపై దృష్టిపెట్టాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం నిర్ణయించింది. రద్దీని తగ్గించేందుకు టోకెన్‌ పద్ధతిని అమలు చేసే అంశంపై పరిశీలించారు.