మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 మే 2020 (11:51 IST)

ఏపీలో కరోనా కలకలం : మరో 67 పాజిటివ్ కేసుల నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తూనే ఉంది. గత 24 గంటల్లో మరో 67 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుని ఏపీలో ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 1717కు చేరింది. 
 
కాగా, గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8263 శాంపిల్స్ పరీక్షించినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 'రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,263 శాంపిల్స్‌ని పరీక్షించగా 67 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్దారింపబడ్డారు. 
 
రాష్ట్రంలోని నమోదైన మొత్తం 1717 పాజిటివ్ కేసులకుగాను 589 మంది డిశ్చార్జ్ కాగా, 34 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1094' అని ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ ఖాతాలో అధికారులు పేర్కొన్నారు. 
 
కొత్తగా నమోదైన 67 కేసుల్లో అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 13, కడప జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 2 కేసులతో పాటు రాష్ట్రంలో చిక్కుబడివున్న గుజరాత్ వాసుల్లో 14 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు.
 
ఇకపోతే జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురంలో 80, చిత్తూరులో 82, ఈస్ట్ గోదావరిలో 45, గుంటూరులో 351, కడపలో89, కృష్ణలో 286, కర్నూలులో 516, నెల్లూరులో 92, ప్రకాశంలో 61, శ్రీకాకుళంలో 5, విశాఖపట్టణంలో 37, వెస్ట్ గోదావరిలో 59, ఇతరులు 14 చొప్పున మొత్తం 1717 కేసులు నమోదైవున్నాయి.