మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 మే 2020 (09:46 IST)

భారత్‌లో పెరుగుతున్న కరోనా మరణాలు - అమెరికాలో విలయతాండవం

కరోనా వైరస్ అనేక దేశాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా, అగ్రరాజ్యం అమెరికాలో విలయతాండవం చేస్తోంది. ఫలితంగా ఆ దేశ ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. తాజాగా వెల్లడైన గణాంకాల మేరకు అమెరికా గత 244 గంటల్లో 1400 మంది చనిపోయారు. ఫలితంగా అమెరికాలో కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 70 వేలకు చేరుకుంది. అలాగే, భారత్‌లో కూడా చనిపోతున్న కరోనా బాధితుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 195 మంది చనిపోగా, మొత్తం మృతులు 1568కు చేరింది. 
 
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 3,900 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 46,433కు చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 12,727 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో  32,134 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇకపోతే, ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. లక్షలాదిమందిని బలి తీసుకుంటున్న ఈ మహమ్మారి అమెరికాలో విలయం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 36 లక్షల మంది కరోనా బాధితులుగా మారగా, 2.5 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 
 
అలాగే, రష్యా, ఇరాన్‌, జపాన్, బ్రిటన్, బంగ్లాదేశ్‌లలో కేసులు ఒక్కసారిగా పెరిగాయి. రష్యాలో వరుసగా రెండో రోజు 10 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. వీటిలో దాదాపు ఆరువేల కేసులు ఒక్క మాస్కోలోనే నమోదు కావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. 
 
జపాన్‌లో కరోనా చెలరేగుతుండడంతో ప్రస్తుతం ఉన్న ఎమర్జెన్సీని ఈ నెలాఖరు వరకు పొడిగించారు. మరోవైపు, బ్రిటన్‌లోనూ కరోనా తగ్గుముఖం పట్టలేదు. కేసులు, మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్‌లో శనివారం 1,223 కరోనా కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 98 వేలు దాటింది. 
 
మన పొరుగుదేశం బంగ్లాదేశ్‌లోనూ కోవిడ్-19 కేసులు 10 వేలు దాటేశాయి. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 16 వరకు ప్రభుత్వం పొడిగించింది. అలాగే పాకిస్థాన్‌లో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 20941 కేసులు నమోదు కాగా, 476 మంది చనిపోయారు, 5635 మంది ఈ వైరస్ బారినుంచి కోలుకున్నారు.