మహారాష్ట్రలో 12మంది పోలీసులకు కరోనా.. ముంబైలో 144 సెక్షన్
మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రజలు కరోనా భయంతో వణికిపోతున్నారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. అంతేకాకుండా పోలీస్ శాఖలోనూ కేసుల తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జెజె మార్గ్ పోలిస్ స్టేషన్‌కు చెందిన 12మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో సంచలనంగా మారింది. వీరిలో ఆరుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లు కూడా ఉన్నారు.
అయితే వీరిలో 8 మందిలో కరోనా లక్షణాలు బయటపడలేవని, పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో వీరి కుటుంబ సభ్యులు సహా, 40 మందిని సెల్ఫ్ క్వారంటైన్‌కు పంపినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. జెజె హాస్పిటల్ పక్కనే జెజె మార్గ్ పోలీస్ స్టేషన్ కూడా ఉండటంతో ఇంకా వైరస్ ఎవరెవరికి సోకిందనే విషయం తెలియాల్సి ఉంది.
మరోవైపు ముంబై నగరంలో సోమవారం ఒక్క రోజే కొత్తగా 510 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. మొత్తం 18 మంది మృతి చెందారు. ఈ కేసులతో ముంబైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9123కు చేరుకుంది. ముంబైలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. మే 17 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది.