శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (13:57 IST)

టీడీపీ సీనియర్‌ నేత జనార్ధన్‌ థాట్రాజ్‌ మృతి

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌ థాట్రాజ్‌ (65) మృతి చెందారు. గుండెపోటుకు గురైన ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మరణించారు.

రవాణాశాఖ మాజీ మంత్రి శత్రుచర్ల విజయ రామరాజుకు మేనల్లుడు అయిన ఆయన విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. జనార్ధన్‌ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్‌ను వీడి మేనమామ శత్రుచర్లతో కలిసి టీడీపీలో చేరారు.

2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసినప్పటికీ కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన అభ్యంతరాలు రావడంతో నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఆయన తల్లిని టీడీపీ నుంచి పోటీ చేయించారు.

అప్పటి నుంచి జనార్ధన్‌ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురవ్వడంతో విజయనగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఇటీవల గుండెపోటుకు గురవ్వడంతో విశాఖపట్నం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

ఆయన మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేశ్ తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.