మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 27 డిశెంబరు 2021 (16:10 IST)

సీఎం జగన్మోహన్ రెడ్డి స్వార్థంతోనే అదానీకి గంగవరం పోర్టు!

గంగ‌వ‌రం పోర్టును పారిశ్రామిక దిగ్గ‌జం అదానీకి క‌ట్ట‌బెట్ట‌డంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటా, 2.1 రెవెన్యూ షేర్ కలిగిన గంగవరం పోర్టును రూ. 645కోట్ల నామమాత్రపు ధరకు అదానీకి పప్పు బెల్లాలకు తెగనమ్మార‌ని ఆరోపించారు. గంగవరం పోర్టును  కారుచౌకగా అమ్మడం వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వార్థం ఉంద‌న్నారు.
 
 
జ్యూడిషియల్ ప్రివ్యూ యాక్ట్ ప్రకారం 100 కోట్లు పైబడిన ఏ టెండరు అయినా ఓపెన్ బిడ్ ద్వార జరగాలనేది గంగవరం పోర్ట్ విషయంలో ఎందుకు పాటించలేద‌ని ప‌ట్టాభి ప్ర‌శ్నించారు. అవినీతికి సహకరించే  ఇటువంటి జీవో లు ప్రజల కంట పడకూడదు అనేనా పబ్లిక్ డౌమైన్ లో జీవోలు లేకుండా చేశార‌ని ఎద్దేవా చేశారు. గంగవరం పోర్టు  తెగనమ్మడం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో, మారిటైమ్ బోర్డులో జరుగుతున్న అవకతవకలు మరిన్ని త్వరలో ఆధారాలతో బయట పెడతామ‌ని చెప్పారు.
 
 
పోర్టుల నిర్మాణం జరిగితే వాటికి అనుబంధంగా ఏర్పడేపరిశ్రమలు, తద్వారా రాబట్టడానికి అవకాశం ఉన్న పెట్టుబడుల ఆవశ్యకతను గుర్తించడం వల్లే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్) మోడల్ లో గంగవరం, కాకినాడ పోర్టుల నిర్మాణానికి శ్రీకారంచుట్టార‌న్నారు. మైనర్ పోర్టులు నిర్వహణ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేశార‌ని చెప్పారు. ఆ రెండుపోర్టులు అనతికాలంలోనే గొప్పఅభివృద్ధిని కూడా సాధించాయ‌ని, అలాంటిపోర్టులను కూడా తెగనమ్మడానికి  ముఖ్యమంత్రి సిద్ధమయ్యార‌ని ఆరోపించారు. 
 
 
గడచిన ఆర్థిక సంవత్సరంలో గంగవరం పోర్ట్ నుంచి రూ.50కోట్ల ఆదాయం ఏపీ ప్రభుత్వానికి వచ్చింద‌ని,  రెవెన్యూ షేర్ 2.1శాతం ద్వారా కూడా ఏపీకి ఆదాయంవస్తోంద‌న్నారు. గతంలో ప్రభుత్వం కేటాయించిన 1800ఎకరాల భూమితోపాటు, మరలా 1000ఎకాలను లీజుకి ఇవ్వడం జరిగింద‌ని, దాని ద్వారా కూడా ఏపీ ప్రభుత్వానికి ఆదాయంవస్తోంద‌న్నారు. గంగవరం పోర్ట్ ద్వారా గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో  డివిడెండ్ రూపంలో రెవెన్యూషేర్ గా, లీజ్ రెంటల్స్ ద్వారా  ఇప్పటివరకు రూ.277 కోట్లు వచ్చినట్టు జి.ఓ. నెం. 4లో స్పష్టంగా పేర్కొన్నార‌ని, అతి తక్కువ పెట్టుబడితో అంతటి ఆదాయాన్ని అందిస్తున్న గంగవరం పోర్టును ఏ ప్రలోభాలకు లొంగి తెగనమ్మార‌ని ప‌ట్టాభి ప్ర‌శ్నించారు.
 
 
 ప్రభుత్వం నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారుల కమిటీ సూచనను కాదని, జగన్మోహన్ రెడ్డి తన అవినీతి కోసమే గంగవరం పోర్టులో ఉన్న 10.4శాతం ప్రభుత్వవాటాను కేవలం తక్కువలో తక్కువగా రూ.645కోట్లకు తెగనమ్మార‌ని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సకలశాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాల‌ని డిమాండు చేశారు.