1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 23 డిశెంబరు 2021 (14:06 IST)

ఎంపీ కేశినేని నాని మాకొద్దంటూ... ప‌శ్చిమ టీడీపీలో గ‌రంగ‌రం!

విజయవాడ ఎంపీ కేశినేని నానిని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌వ‌ర్గ ఇన్ ఛార్జిగా నియ‌మించారు. దీనిని తాము పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నామ‌ని, పశ్చిమ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా కేశినేని నాని వద్దంటూ కొంద‌రు టిడిపి కార్యకర్తలు నినాదాలు చేయడంతో గ‌డ‌బిడి మళ్ళీ మొద‌లైంది.
 
 
విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌వ‌ర్గ ఇన్ ఛార్జిగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలకే బాధ్యత అప్పగించాలని టీడీపీ ఒక వ‌ర్గం వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం బుద్దా వెంకన్న, నాగుల్ మీరా కృషి చేశార‌ని, ఎంపి కేశినేని నాని నియంతృత్వ పోకడల వల్లే కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ నష్టపోయింద‌ని అస‌మ్మ‌తి వాదులు పేర్కొంటున్నారు. 

 
చంద్రబాబు నివాసంపై దాడి చేసినా, మంత్రులు బూతులు తిట్టినా ఎంపి స్పందించ లేద‌న్నారు. వైసిపి నాయకుల విమర్శలపై ఏనాడైనా మాట్లాడారా అని ప్ర‌శ్నిస్తున్నారు. చంద్రబాబు ఇంటి వద్ద ఎమ్మెల్యే జోగి రమేష్ ను దాడిని అడ్డుకున్న నాయకుడు బుద్దా వెంకన్న అని, కార్యకర్తలకు, నాయకులుగా అండగా ఉండే నేతలు వెంకన్న, నాగుల్ మీరా అని పేర్కొంటున్నారు. పార్టీ కోసం పని‌చేసే వారికే ప్రాధాన్యం ఇవ్వాల‌ని, ఎంపీ కేశినేని నానికి నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు ఎవరూ సహకరించర‌ని తేల్చి చెపుతున్నారు. నాని నియామకాన్ని రద్దు చేయాలని చంద్రబాబు కోరుతున్నారు.

 
అయితే, టిడిపి అధ్యక్షుడు పార్టీ బలోపేతానికి తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని మైనార్టీ నాయకులు ఫ‌తావుల్లా చెప్పారు. ఎంపీ కేశినేని నానిని టిడిపి వెస్ట్ నియోజవర్గ ఇన్చార్జిగా నియమించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో టిడిపి బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.