తెలంగాణలో పదవ తరగతి పరీక్షలపై.. హైకోర్టులో మళ్లీ విచారణ
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో హైకోర్టు ఆదేశానుసారం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో తిరిగి పరీక్షలు నిర్వహించేందుందు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును విన్నవించింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు పదో తరగతి పరీక్షలు నిర్వహించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం జూన్ 8 వ తేది నుంచి పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేస్తుంది.
మరో సారి పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షల నివేదికను హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించడంతో జిల్లాల వారీగా పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని అడ్వాకేట్ జనరల్ పేర్కొన్నారు.
కరోనా కేసుల నేపథ్యంలో అన్ని సెంటర్లలో జాగ్రతలు తీసుకుంటున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఇకపోతే ప్రస్తుతం తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేసింది.
కరోనా వ్యాప్తి లాక్‌డౌన్ వల్ల సొంత జిల్లాలకు వెళ్లలేక పోయిన రెసిడెన్షియల్ హాస్టళ్లు, ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని పదో తరగతి హాస్టల్ విద్యార్థులకు అదే జిల్లాలో పరిక్షలు రాసే అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యార్థుల వివరాలను సేకరించి పంపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డీఈఓలను ఆదేశించింది. ఇబ్బందులు ఉన్న విద్యార్థులు తమకు సమాచారం ఇవ్వాలని శుక్రవారమే డీఈఓలు ఫోన్ నంబర్లను ప్రకటించారు.