శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2020 (14:26 IST)

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు : మొత్తం 12 రోజులు.. అందులో మూడు రోజులు సెలవులు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌదర్ రాజన్ ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. మొత్తం 12 రోజుల పాటు ఇవి జరుగనున్నాయి. 
 
ఇదిలావుంటే, అసెంబ్లీ ఆవరణలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీతో పాటు శాసనసభ, మండలి సమావేశాల ఎజెండాను ఖరారు చేశారు. 
 
ఈ నెల 8వ తేదీ(ఆదివారం)న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 12 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నెల 9, 10, 15 తేదీల్లో సభకు సెలవులు ప్రకటించారు. బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్‌, మంత్రులు, అక్బరుద్దీన్‌ ఓవైసీ, భట్టి విక్రమార్క హాజరయ్యారు.
 
అంతకుముందు గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి పనులను ప్రముఖంగా ప్రస్తావించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర జలవిధానాన్ని రూపొందించుకుని అమలు చేస్తుందని తెలిపారు. 
 
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రభుత్వం నీరందిస్తున్నది అని తెలిపారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్దరించింది. దీనివల్ల తెలంగాణలో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది అని గవర్నర్ వివరించారు.
 
అలాగే, ప్రపంచంలోకెల్లా అతి భారీ బహుళ దశల ఎత్తిపోతల పథకంగా రికార్డు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు దశల వారీగా పూర్తవుతున్నది. శరవేగంగా నడుస్తున్న పనులు తెలంగాణ ప్రజల కళ్ల ముందే ఉన్నాయి. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తవుతుందని పేర్కొన్నారు. 
 
తెలంగాణాలో నీటిపారుదల రంగం అద్భుతమైన పురోగతి సాధించిందని చెప్పడానికి, ఇప్పటికిప్పుడు మన కళ్లముందు సాక్షాత్కారిస్తున్న నిలువెత్తు నిదర్శనం ఈ యాసంగిలో వరి సాగులో తెలంగాణ సాధించిన పురోగతని చెప్పారు. అలాగే, కేసీఆర్ సర్కారు చేపట్టిన అనేక అభివృద్ధి పనులను ఆమె వివరించారు.