శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (10:48 IST)

కరోనా ఎఫెక్టు : పరీక్షా నిబంధనల్లో మార్పులు - ఇంజనీర్ కోసం గాలింపు

తెలుగు రాష్ట్రాలను కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. ఇదేసమయంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభంకావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణా నిబంధనల్లో మార్పులు చేసింది. 
 
ఈ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాస్కులను ధరించి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇదేసమయంలో వారు తమ సొంత వాటర్ బాటిల్‌ను పరీక్షా హాల్‌లోకి తీసుకెళ్లేందుకు కూడా అనుమతినిస్తున్నట్టు తెలిపారు.
 
ముఖ్యంగా, జ్వరం, దగ్గ, జలుబుతో బాధపడుతున్న విద్యార్థులను విడిగా మరో గదిలో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తామని, దీనిపై అక్కడి ఇన్‌చార్జ్, ఇన్విజిలేటర్లు సొంతంగా నిర్ణయం తీసుకుంటారని ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు తెలియజేశారు. 
 
ఇదిలావుండగా, తెలంగాణలో కరోనా అనుమానితుల సంఖ్య 550కి చేరువైంది. బుధవారం ఒక్కరోజులో 90 మంది బాధితులు గాంధీ ఆసుపత్రిని ఆశ్రయించగా, వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. 
 
ఇదిలావుంటే, చైనా నుంచి వచ్చిన చిత్తూరు జిల్లావాసి కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. జిల్లాలోని ఎర్రావారిపాలెం, నెరబైలుకు చెందిన కుండ్ల గిరిధర్ చైనాలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 25న చైనా నుంచి స్వదేశానికి ఆయన తిరిగొచ్చాడు.
 
బెంగళూరు విమానాశ్రయంలో దిగిన తర్వాత నుంచి ఆయన కనిపించకుండా పోయాడు. కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో ఆయన కనిపించకుండా పోవడం సంచలనమైంది. విషయం తెలిసిన వైద్యాధికారులు ఆయన కోసం గ్రామానికి వెళ్లి ఆరా తీసినట్టు తెలిసింది.