హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో వర్క్ ఫ్రమ్ హోం.. ఉద్యోగులంతా ఇంటికి...
హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ముఖ్యంగా, టెక్కీలు భయంతో వణికిపోతున్నారు. కంపెనీ పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లి వస్తుంటారు. దీంతో అనేక మంది టెక్కీల్లో ఈ వైరస్ లక్షణాలు ఉన్నట్టు సమాచారం.
ముఖ్యంగా, పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు కొలువుదీరిన రహేజా మైండ్ స్పేస్‌లోని బిల్డింగ్ నంబర్ 20లో పనిచేస్తున్న ఓ ఐటీ ఉద్యోగినికి కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్ రావడంతో సహోద్యోగులు బెంబేలెత్తిపోయారు.
బిల్డింగ్ నంబర్ 20లోని ఐటీ కంపెనీలన్నీ బుధవారం తమ ఉద్యోగులను ఇళ్లకు పంపించేశాయి. అంతేకాదు, హైదరాబాద్‌లో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలను జారీచేశాయి.
కరోనా పాజిటివ్‌గా తేలిన పరిమళ అనే ఉద్యోగిని డచ్‌కు చెందిన ఐటీ కంపెనీ డీఎస్‌ఎంలో విధులు నిర్వర్తిస్తోంది. ఉద్యోగులను ఇంటికి పంపించేసిన ఈ కంపెనీ శుభ్రత చర్యలను చేపట్టింది. ఇప్పటివరకూ ఇండియాలో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అధికారికంగా వెల్లడించారు.
ఇందులో ఒకటి హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ఆ రోగిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డు హౌస్ ఫుల్ అయింది. గాంధీ ఆసుపత్రికి కెపాసిటీకి మించి కరోనా అనుమానిత కేసులు వస్తున్నాయి.
ఐసోలేషన్‌లో ఉన్న పడకలు 40 మాత్రమే.. కానీ 40 గంటల వ్యవధిలో గాంధీకి 50 మంది అనుమానితులు వచ్చారు. దీంతో బెడ్ల కొరతతో పెయిడ్ రూమ్స్‌ను సైతం ఐసోలేషన్‌కి వినియోగిస్తున్నారు. తక్కువ సిమ్‌టమ్స్ ఉన్నవారిని హోం ఐసోలేషన్‌కు వైద్యులు ప్రిఫర్ చేస్తున్నారు.
ఇదిలావుంటే, హైదరాబాద్ నగరంలో కరోనా ఆస్పత్రిని నెలకొల్పే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ఆస్పత్రి ఏర్పాటుకు అనంతగిరితో పాటు మరో రెండు ప్రాంతాలను సర్కార్ పరిశీలిస్తోంది. అలాగే, సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రి, ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రులను కూడా పరిశీలిస్తోంది.
గాంధీ ఆస్పత్రిలో ఇప్పటికే ఐసొలేషన్ వార్డు ఫుల్ అయిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర రోగులు, బంధువులు ఇబ్బందులకు గురవుతుండటంతో.. నగరానికి దూరంగా ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.