కరోనా ప్రమాద ఘంటికలు... దేశ వ్యాప్తంగా 28 కేసులు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఫలితంగా దేశవ్యాప్తంగా 28 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇందులో ఢిల్లీలో ఒక కేసు నమోదుకాగా, ఆగ్రాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్టు వెల్లడించారు.
ఇకపోతే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఒకటి, తెలంగాణాలో ఒకటి, కేరళలో మూడు, 16 మంది ఇటలీ వాసులు, ఒక భారతీయ డ్రైవర్‌కు ఈ వైరస్ సోకినట్టు మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు.
ముఖ్యంగా, ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన మరో 16 మందికి ఈ వైరస్ సోకినట్టుగా గుర్తించారు. వీరిలో ఒకరు భారతీయులు కాగా, 16 మందిని ఇటలీకి చెందిన వారుగా పేర్కొన్నారు.
మొత్తం 21మంది పర్యాటకులు వైద్యుల పరిశీలనలో ఉన్నారు. వీరందరినీ ఎయిమ్స్‌లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొత్త కేసులు గుర్తించడంతో భారతదేశంలో కరోనా వైరస్ భయాందోళనలు పెరుగుతున్నాయి.
దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా వైరస్ కేసులు పెరిగిపోతుండటంతో అన్ని విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించినట్టు మంత్రి చెప్పారు.