కరోనా ప్రభావం.. ట్విట్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్ణయం.. మీడియాపై ఆంక్షలు
కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ తన ఉద్యోగుల క్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోబ్లాగింగ్ సైట్ గా పేరుగాంచిన ట్విట్టర్ కు ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. చైనా వెలుపల కూడా అనేక దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా నమోదవుతుండడంతో తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో బయటి వాతావరణంలో కరోనా వ్యాప్తి వుండటంతో తన ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా దేశాల్లో ఈ సౌకర్యాన్ని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ట్విట్టర్ అధికారి జెన్నిఫర్ క్రిస్టీ తెలిపారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో, ఆసుపత్రి ప్రాంగణంలో పలు ఆంక్షలను విధించారు. కేసుల వివరాలను బయటకు వెల్లడించవద్దని వైద్యులకు అంతర్గతంగా ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ మాత్రమే కరోనాపై అప్ డేట్స్ ఇవ్వాలని ఆదేశించారు. ఇదే సమయంలో ఆసుపత్రి వద్ద మీడియాపై కూడా ఆంక్షలు విధించారు.