కరోనా వైరస్ భయం.. 54 వేల మంది ఖైదీలకు విముక్తి
ఇరాన్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ దేశంలో 2300 మందికి ఈ వైరస్ సోకింది. దాదాపు 77 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌కు చెందిన చట్టసభ ప్రతినిధుల్లో సుమారు 8 శాతం మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు.
ఈ పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని అరికట్టాలన్న ఉద్దేశంతో తాజాగా ఆ దేశం 54 వేల మంది ఖైదీలను విడుదల చేసింది. కిక్కిరిసన జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. కోవిడ్19 పరీక్షలో నెగటివ్‌గా తేలిన ఖైదీలను జైలు నుంచి రిలీజ్ చేస్తున్నట్లు ఆ దేశ న్యాయప్రతినిధి గోలమ్‌హోసన్ ఇస్మాయిలీ తెలిపారు.
అయితే అయిదేళ్ల కన్నా ఎక్కువ కాలం శిక్ష పడిన వారిని మాత్రం విడుదల చేయడం లేదని చెప్పారు. అలాగే, బ్రిటన్, ఇరాన్‌కు చెందిన ఛారిటీ వర్కర్ నజానిన్ జగారీ రాట్‌క్లిఫ్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు ఓ బ్రిటీష్ ఎంపీ తెలిపారు.