సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (15:35 IST)

పోతిరెడ్డిపాడుపై దృష్టిసారించిన కృష్ణా బోర్డు - పూర్తి వివరాలతో కేంద్రం వద్దకు...

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా రాయలసీమ ప్రాంతంలోని పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకాని తెలంగాణ సర్కారు ఆదిలోనే మోకాలొడ్డింది. దీనిపై కృష్ణా జలాల బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో బోర్డు ఛైర్మన్ రంగంలోకి దిగారు. ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పూర్తి వివరాలను ఏపీ సర్కారును కోరనున్నారు. ఆ తర్వాత కేంద్రం వద్ద పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నారు. 
 
శ్రీశైలం నుంచి రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కొత్త పథకాన్ని చేపట్టడటం, శ్రీశైలం ఎడమగట్టు కాలువ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు విస్తరించడానికి ఏపీ సర్కారు జీవో జారీచేసింది. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టును పోతిరెడ్డిపాడు వద్ద చేపట్టనుంది. ఈ ఎత్తిపోతల పథకం చేపట్టకుండా అడ్డుకోవాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో రాష్ట్ర‌ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు జారీ చేసిన జీవోకు సంబంధించిన వివరాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కోరనుంది. ఏపీ‌ నుంచి సమాధానం వచ్చిన తర్వాత మొత్తం వ్యవహారాన్ని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
 
బోర్డు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని, పూర్తి వివరాలను కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తామని ఛైర్మన్‌ బదులిచ్చినట్లు తెలిసింది. ఏపీ నుంచి పూర్తి వివరాలు కోరి, వారి సమాధానం ఆధారంగా నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై కేంద్రం అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసి చర్చించే అవకాశాలు ఉంటాయి.