శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2019 (21:40 IST)

రగులుతున్న రాజధాని.. మందడం ఉద్రిక్తం

ఏపీ రాజధాని రగిలిపోతోంది. ప్రభుత్వ ఆలోచనను పసిగట్టి అట్టుడికి పోతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏ నిముషాన ఏం వినాల్సివస్తుందోనని అమరావతి బిక్కుబిక్కుమంటోంది. నిన్నటివరకూ నిర్మాణాల చప్పుళ్లు. పరుగులు తీసే వాహనాల రణగణధ్వనులతో కళకళలాడిన రాజధాని ఇప్పుడు తుఫాను కు ముందు ప్రశాంతతో భీతిల్లిపోతోంది.
 
మందడంలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తం
మందడంలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ నేతల ప్రకటనతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు టెంట్లను పోలీసులు బలవంతంగా తొలగించారు. మరో రెండు టెంట్ల కింద పెద్ద ఎత్తున రైతులు, మహిళలు బైఠాయించారు. ‘రక్తాన్నైనా చిందిస్తాం అమరావతిని సాధిస్తాం’ అంటూ రైతుల నినాదాలు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. మందడం రైతులకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

శుక్రవారం కాబినెట్ సమావేశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసుల నిబంధనలను ఉల్లంగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ఎటువంటి నిరసనలు చేయమని సంతకాలు పెట్టాలని పోలీసులు రైతులపై ఒత్తిడి తీసుకొచ్చారు.

అయితే సంతకాలు పెట్టేందుకు రైతులు నిరాకరించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని రాజధాని రైతులు కలిశారు. ఎమ్మెల్యే అందుబాటులోకి రాకపోవడంతో ఇంటికి వినతి పత్రం అంటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రాజధానిని ఇక్కడే ఉంచి.. అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
గవర్నర్‌ను కలిసిన రాజధాని రైతులు
అమరావతి రైతులు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను గురువారం కలిశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వారు వినతిపత్రం సమర్పించారు. తొమ్మిది రోజులుగా రాజధానిలో జరుగుతున్న పరిణామాలను ఈ సందర్భంగా రైతులు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆనాడు ప్రభుత్వం అడిగితే అందరమూ భూములు ఇచ్చామని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. 
 
రాజధాని అమరావతిలోనే ఉండేలా గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరినట్లు వారు తెలిపారు. అయితే గవర్నర్ ఈ విషయాలపై సానుకూలంగానే స్పందిచినట్లు రైతులు తెలిపారు. 175 మంది ఎమ్మెల్యేల సమక్షంలో ఆనాడు అమరావతిని రాజధానిగా అంగీకరించారని, జగన్ కూడా ముప్పై వేల ఎకరాలు కావాలని చెప్పినట్లు వారు గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు ఏకపక్షంగా రాజధానిని తరలిస్తామని ప్రకటించడం అన్యాయమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అమరావతిలోనే రాజధాని ఉంచాలని, లేకుంటే తమ జీవితాలు రోడ్ల పాలవుతాయని అన్నారు. మా బాధను అర్థం చేసుకొని అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.
 
నెల్లూరులో కాగడాల ప్రదర్శన
రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నెల్లూరులో కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కాగడాల ప్రదర్శన జరిగింది. వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు సాగిన ప్రదర్శన కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, తాళ్లపాక అనూరాధ, ఆనం వెంకట రమణారెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడు, జెన్ని రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ... "వైసీపీ పాలన చూసి ఆర్నెళ్లలో ప్రజలకు పిచ్చి పట్టే పరిస్థితి వచ్చింది. రాజధాని విషయంలో మంత్రి బొత్స భాష ఎవరికీ అర్ధం కాదు. ట్రాన్సలేటర్ ను పెట్టుకున్నా అర్ధం కాని పరిస్థితి. జీఎన్ రావు కమిటీ ఇంకా పిచ్చి పట్టిస్తోంది. సుందరమైన అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశాక మళ్లీ కమిటీ ఎందుకో? జీఎన్ రావు కమిటీకున్న క్రెడిబులిటీ ఏమిటి? మంత్రుల నివాసం అమరావతిలో, కార్యాలయం వైజాగ్‌లో, అసెంబ్లీ అమరావతిలో, సీఎం ఇల్లు వైజాగ్‌లో, పిచ్చి ముదిరిందా?

ఎక్కడైనా రాజధానిలోనే అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ అంతా రివర్స్ ఆర్నెళ్లలో మీ అయోమయ నిర్ణయాలు రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు 16 వేల కోట్ల లోటు బడ్జెట్ లోనూ దేశంలోని అన్ని రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలిపారు. ఈ రోజు పరిస్థితులు పూర్తిగా తిరగబడ్డాయి.. ఏపీ అంటేనే దేశం, ప్రపంచం అంతా భయపడే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి ఆలోచనా తీరే శాడిస్టిక్ థింకింగ్.

మెజారిటీ పోలీసు, రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేలకు తొత్తులుగా వ్యవహరిస్తూ ఆయా శాఖల ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులకేమో పెద్దపెద్ద భవనాలు, కార్లు ఉండొచ్చంట. పేదలకు చిన్న కారు, పదంకణాల ఇల్లు ఉండకూడదంట. రేషన్ కార్డులు, పింఛన్లు కట్ చేస్తారట. మోదీ శంకుస్థాపన చేసిన శిలాఫలకం వద్ద దీక్ష చేపట్టబోతున్న కన్నా లక్ష్మీనారాయణకి అభినందనలు. రాజధాని రైతులకు మద్దతు విషయంలో పవన్ కళ్యాణ్ ముందున్నారు. పార్టీ పెట్టి ఎత్తేసి విలీనం చేసిన పెద్దన్న మాత్రం ప్రభుత్వానికి మద్దతుగా రాగం అందుకున్నారు.

ప్రజల కోసం పోరాడుతున్న సోదరుడి భుజం తట్టాల్సిందిపోయి వైజాగ్‌లో ఆస్తుల విలువ కోసం ప్రజల బాధలను విస్మరించారు. విశాఖలో ఆస్తులున్న వారే అక్కడ రాజధాని కోరుకుంటున్నారు. వైజాగ్ అంటే మా అందరికీ ఎంతో అభిమానం. హుద్ హుద్ తుఫాన్‌తో కకావికలమైన వైజాగ్‌ను మెట్రోపాలిటన్ సిటీగా, ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడిదే.

రాజధాని ప్రాంత మహిళలు, వృద్ధులు, పిల్లలు రోడ్లపైకి వచ్చి బాధపడుతుంటే కడుపు తరుక్కుపోతోంది. వారికి మనమంతా మద్దతు పలుకుదాం. రాష్ట్రంలో పాలన స్థంభించింది. మీకు ఎందుకింత కక్ష.. ప్రజల గొంతు కోసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేశామని దుష్ప్రచారం చేస్తున్నారు.

పాలన మీ చేతిలోనే ఉంది.. దమ్ముంటే చర్యలు తీసుకోండి. జగన్మోహన్ రెడ్డికి తన ఆర్నెళ్ల పాలన మీద నమ్మకం ఉంటే రెఫరెండంకి వెళ్లండి. ప్రజలు కచ్చితంగా మీ తీరును వ్యతిరేకిస్తారు. రాజీనామా చేయనక్కర లేదు.. మనస్సాక్షితో ఆలోచించి తీరు మార్చుకుంటే చాలు" అని ధ్వజమెత్తారు.
 
30న జనసేన విస్తృత స్థాయి సమావేశం
జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఈ నెల 30 వ తేదీన నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం అవుతుందని తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులు, అమరావతి గ్రామాల ప్రజలు – రైతుల ఆందోళన, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆశలు – ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రత, జనసేన స్టాండ్, పార్టీ పరంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు తదితర అంశాలపై కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్టు పేర్కొంది. ఈ సమావేశంలో జనసేన పొలిట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ, పార్టీ వ్యూహాత్మక కమిటీ, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ, ముఖ్య నేతలు పాల్గొంటారని వెల్లడించింది.