ఆ జీవోను తక్షణమే రద్దు చేయాలి: పి.డి.ఎస్.యు
రాష్ట్రంలోని ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన రద్దును తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) రాష్ట్ర అధ్యక్షులు ఎ. రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రైవేట్, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు రద్దు చేయడం సరైంది కాదన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కూడా రద్దు చేయడం సమంజసం కాదు అన్నారు. అందుకోసం జారీ చేసిన జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
2020- 21 సంవత్సరం నుండి బోధనా ఫీజుల ప్రక్రియను నిలిపి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం పేద, మధ్య తరగతి విద్యార్థులను పోస్టుగ్రాడ్యుయేషన్ చదువుకు దూరం చేయడమే అని ఆయన విమర్శించారు. ప్రభుత్వ విశ్వ విద్యాలయాలు, పీజీ కళాశాలల్లో సరిపడా సీట్లు లేవు అన్నారు. అన్ని రకాల కోర్సులకు మొత్తం ఫీజు చెల్లిస్తానని ఇచ్చిన హామీని 18 నెలల్లోనే జగన్ ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటు విద్యా సంస్థలను పూర్తిస్థాయిలో రద్దుచేసి ప్రభుత్వ విద్య మాత్రమే కొనసాగించాలి.అమ్మ ఒడి పేరుతో వేలాది రూపాయలు శ్రీ చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న వారికి ఇస్తున్న ప్రభుత్వం ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు చెల్లించకపోవడం సహేతుకం కాదన్నారు.
జీవో నెంబర్ 77 పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాణాలు, నాణ్యత పాటించని ప్రైవేట్ కళాశాలల పై చర్యలు తీసుకోవాలి. ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ తనిఖీలు నిర్వహించాలి. పాటించని కళాశాలల పై చర్యలు తీసుకోవాలి.అంతేకానీ విద్యార్థులకు బోధన ఫీజులు రద్దు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు.
మొత్తం ఫీజు చెల్లిస్తామని ఇచ్చిన హామీ నుండి యూటర్న్ తీసుకున్న జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 77 ను తక్షణమే రద్దు చేయాలని, అర్హులైన విద్యార్థులందరికీ పూర్తి ఫీజులు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఉపకార వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు నగర అధ్యక్షులు ఐ. రాజేష్, నాయకులు సందీప్ తదితరులు పాల్గొన్నారు.