శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 31 జులై 2019 (08:22 IST)

వైసీపీకి అంతే గడువు.. పవన్ కళ్యాణ్

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తుల కోసం పోటీపడిన పార్టీల పేర్లు బట్టబయలు చేశారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో ఆ పార్టీకి పొత్తు ఈ పార్టీకి పొత్తు అంటూ ప్రచారం చేశారని మండిపడ్డారు. 
 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తనను సంప్రదించిందని పొత్తు పెట్టుకుందామని అడిగితే తాను వద్దన్నట్లు చెప్పుకొచ్చారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం కార్యకర్తల సమీక్షలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం పొత్తుల కోసం పరితపించిందన్నారు. 
 
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం తనను సంప్రదించారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఒంటరిగా పోటీ చేయాలని తాను భావించానని ఆ నేపథ్యంలో వారితో పొత్తులు పెట్టుకోలేదని తేల్చి చెప్పారు. అంతేకానీ చీకటి పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు.
 
అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గట్టి పోటీ ఇచ్చిందన్నారు. అయితే డబ్బు, మీడియా వంటివి లేకపోవడం వల్ల పరాజయం పాలయ్యామన్నారు. మరోవైపు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజులు సమయం ఇస్తున్నట్లు తెలిపారు. 
 
100 రోజుల అనంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి పాలన ఎలా ఉందో అనేది తెలుసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. మంచి పాలన అందిచకపోతే జనసేన పార్టీ తరపున నిలదీస్తాం...ప్రశ్నిస్తాం...పోరాడతాం అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.