బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2020 (22:14 IST)

మోడీ ఆర్థిక విధానాలతో దేశం అధ్వాన్నం:సీపీఐ

నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కాషాయీకరణ, ఆర్థిక విధానాల వల్ల దేశమంతా అతలాకుతలమవుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ధ్వజమెత్తారు.
 
కార్పొరేట్, మతం, కాషాయీకరణ అజెండాతో ముందుకు పోతున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విధానాల్ని వ్యతిరేకిస్తూ, పార్లమెంటు సమావేశాల సందర్భంగా అఖిల భారత నిరసన దీనం పాటించాలన్న సీపీఐ దేశవ్యాపిత పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించారు.

విజయవాడ దాసరిభవన్ వద్ద రామకృష్ణతో పాటు సీపీఐ, అనుబంధ ప్రజా సంఘాల నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ, కార్పొరేట్ రంగాలకు పెద్దపీట వేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాల్ని ఎండగడుతూ నినదించారు. మతోన్మాద విధానాలను, ఆరెస్సెస్ అజెండాను అవలంభిస్తున్న మోడీ ప్రభుత్వ వైఖర్ని తూర్పారబట్టారు.
 
గుంటూరులో జరిగిన నిరసనల్లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పాల్గొనగా, విశాఖపట్నం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
 
విజయవాడలో సిపిఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ దేశ జీడీపీ వృద్ధి రేటు - 23.9శాతానికి దిగజారిందని, ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారని వివరించారు. 2014 పార్లమెంటు ఎన్నికల సమయంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామంటూ మోడీ అధికారంలోకి వచ్చారని, ఈ ఆరేళ్ల కాలంలో కోట్లాది ఉద్యోగాలు కోల్పోయే పద్ధతుల్లో పరపాలన సాగిందన్నారు.

కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడంలోను ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కరోనా వచ్చిన రెండు మాసాల తర్వాత లాక్ డౌన్ పేరుతో అందరిచేత చప్పట్లు కొట్టించుకుని, కొవ్వొత్తులు వెలిగించుకుని నేడు కరోనా బాధితులను గాలికొదిలేశారన్నారు. ప్రపంచంలోనే అమెరికా తర్వాత రెండో స్థానంలో కరోనా పాజిటివ్ కేసులు భారత్ లో వచ్చాయని, దాదాపు 50లక్షల మంది బాధితులు దేశంలో ఉన్నారంటే, కచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకోబోతుందని చెప్పారు.

కరోనా నివారణకు చర్యలు తీసుకోవడంలోను, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలోను కేంద్రం వైఫల్యం చెందిందని విమర్శించారు. ఆస్పత్రుల్లో కరోనా రోగులకు బెడ్ల సౌకర్యాలు లేనందున నానా ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా మోడీ విస్మరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

మతం, కాషాయీకరణ ముసుగులో ప్రశ్నించిన ప్రజలపైన, మేధావుల పైనా దాడులు, కేసులకు బీజేపీ సర్కారు పాల్పడుతోందని ఎండగట్టారు. బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని అధికార దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. వామపక్ష నేతలతోపాటు రచయితలు, మేధావుల పై తప్పుడు కేసులు మోపుతోందని మండిపడ్డారు.

సిపిఎం నేత సీతారాం ఏచూరి, జయతీ ఘోష్, యోగేంద్ర యాదవ్ తదితరులపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండిస్తున్నామన్నారు. గతంలో విరసం నేత వరవరరావు, మేధావి ప్రొఫెసర్ సాయిబాబా తదితర నేతలపై అన్యాయంగా కేసులు నమోదు చేయించిందన్నారు. బీజేపీ అవలంభిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని అడ్డుకుంటామన్నారు. మోడీ పాలనలో అన్ని రంగాలు విఫలమయ్యాయన్నారు.

కార్పొరేట్, కాషాయీకరణ అజెండాతో కేంద్రం ముందుకు పోతోందని, వాటికి వ్యతిరేకంగా పార్లమెంటు సమావేశాల సందర్భంగా, దేశ వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయన్నారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే, విమానయాన, టెలికమ్ రంగాలను కార్పొరేట్ రంగాలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.

వైద్యరంగాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేసి, కార్పొరేట్ కు అప్పగిస్తోందన్నారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నేడు సిపిఐ చేపట్టిన నిరసనలు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ విజయవంతమయ్యాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు.
 
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య మాట్లాడుతూ కరోనా సమయంలోనూ ప్రజలపై కేంద్రం పెనుభారం మోపుతోందన్నారు. రైతాంగ విధానాల్ని అవలంభిస్తోందని, వైద్యాన్ని వ్యాపారమయం చేస్తున్నారని విమర్శించారు. కృష్ణాజిల్లా సీపీఐ కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. రచయితలు, హేతువాదులు, జర్నలిస్టుల పై దాడులు, కేసుల పేరుతో బెదిరింపు చర్యలకు దిగుతోందని దుయ్యబట్టారు.
 
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి లెనిన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవి సుబ్బారావు, జి. రంగన్న, శివారెడ్డి, ఇన్సాఫ్ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ అఫ్సర్, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి పి. చంద్రానాయక్, నాయకులు ఆర్. పిచ్చయ్యలతోపాటు పలువురు సీపీఐ, ప్రజాసంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.