బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (19:33 IST)

దేశవ్యాప్తంగా ఒకేసారి సార్వత్రిక ఎన్నికలు?

మోదీ సర్కార్ మరో భారీ మార్పు దిశగా అడుగులు వేస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఒకేసారి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలన్నఆలోచనకు కార్యారూపం దిశగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంలో ఉన్న సమస్యలను అధిగమించడంతో పాటు దేశంలో అన్ని ఎన్నికలకూ ఒకే ఓటర్ల జాబితా ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. 

ఒకేసారి సార్వత్రిక ఎన్నికల అంశంపై ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు, ఇతర ముఖ్యులతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన త్వరలోనే దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రస్తుతం రాష్ట్రాల్లో ఉన్న తాజాగా ఎన్నికైన ప్రభుత్వాల భవితవ్యం కూడా ప్రశ్నార్ధకంగా మారబోతోంది.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రంలో కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎన్నికల ఖర్చును ఆదా చేయవచ్చని మోదీ సర్కారు ముందు నుంచి సూచిస్తోంది. అలాగే భారీగా వనరుల ఆదాకు కేంద్రం ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా సేకరించింది.

అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించింది. ఈ సమావేశంలో పలు రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.  రాజకీయంగా చేయాల్సిన కసరత్తు కొంత మేర పూర్తైనప్పటికీ సాంకేతికంగా ఉన్న ఇబ్బందులను అధిగమించడం ఇప్పుడు తలకు మించిన భారమవుతోంది.

ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒకే ఓటర్ల జాబితాను సిద్ధం చేయాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు ప్రధాని కార్యాలయం ఓ అత్యున్నత స్ధాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే అన్ని రాష్ట్రాల్లో కలిపి ఒకే ఓటర్ల జాబితా తయారు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎన్నికల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు కేంద్రం ఒకే ఓటర్ల జాబితా తయారీపై దృష్టిపెట్టినట్లు సమాచారం. అంటే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, స్ధానిక సంస్ధలకు కలిపి ఒకేసారి ప్రజాతీర్పు కోరుతున్నప్పుడు వాటన్నింటికీ కలిపి ఒకే జాబితా సిద్దం చేయాల్సి ఉంటుంది.

ఈ విషయంలో రెండు అంశాలు కీలకంగా మారాయి. ఒకటి రాష్ట్రాలన్నీ ఒకే ఓటర్ల జాబితా రూపొందించాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అలాగే ఈ జాబితాను అన్ని రాష్ట్రాలు స్ధానిక సంస్ధల ఎన్నికల్లోనూ వినియోగించుకోవడం.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా ప్రస్తుతం అమలవుతున్న వివిధ ఓటర్ల జాబితాను సవరించి ఒకే జాబితాగా మార్చడం.

ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243కే, 243 జెడ్‌ఏ ను సవరించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్రం ప్రస్తుతం న్యాయ పరమైన అంశాలపై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను సాధ్యమైనంత తక్కువ సమయంలో పూర్తి చేయడం ద్వారా రాజ్యాంగ సవరణ చేపట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.