పేదల సొంతింటి కలను సీఎం నిజం చేశారు: మంత్రి బొత్స
పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిజం చేశారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ.. మరెన్నో విప్లవాత్మక పథకాలతో యావత్ దేశం చూపును ఆకర్షించారన్నారు.
ఎన్నికల ప్రణాళిక మనకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని మొదటి మంత్రివర్గ సమావేశంలోనే చెప్పారని గుర్తుచేశారు. విజయనగరం జిల్లా గుంకలాంలో ఇళ్ల పట్టాల పంపిణీ బహిరంగ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విజయనగరం జిల్లాలో 1.08 లక్షల ఇళ్ల పట్టాల లబ్ధిదారులు ఉంటే.. గుంకలాం లేఅవుట్‌లో 12 వేలమందికి పైగా అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను సీఎం పంపిణీ చేస్తున్నారన్నారు. ఇళ్ల పట్టాలే కాదు.. ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు.
మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చడమే కాకుండా.. ప్రజల అవసరాలను గుర్తించి.. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వ పథకాలను రూపొందించి అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని అన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను ఒక్కొక్కటిగా తూ.చా తప్పకుండా 90 శాతానికి పైగా అమలు చేశారన్నారు.
ఇంతకు ముందు రాజకీయ పార్టీలు మేనిఫెస్టో ప్రకటించి ఐదేళ్ల సమయం ఉందని కాలక్షేపాలు చేసేవని, కానీ, ఇవాళ సీఎం వైయస్ జగన్ నిర్ణిత సమయం ఇచ్చి.. ఆ సమయంలోగా ఆ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. కమిట్‌మెంట్‌తో సీఎం పనిచేస్తున్నారు.
అదే విధంంగా జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టుకు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని, దాదాపు 80 శాతం పనులు మహానేత హయాంలోనే పూర్తయ్యాయన్నారు. ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల తోటపల్లి నిర్లక్ష్యానికి గురైందన్నారు.
తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ.500 కోట్లు మంజూరు చేయాలని సీఎంను కోరారు. దీంతోపాటు మైక్రో, మీడియం ప్రాజెక్టులకు మరో రూ.500 కోట్లు ఇస్తే.. ఈ జిల్లాలో 1.60 లక్షల ఎకరాలకు అదనంగా ఆయకట్టు వస్తుందని, నీటికి ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు.